ఓవైపు శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్న వేళ, సరిగ్గా జ్యోతి దర్శనానికి కొన్ని రోజుల ముందు, అత్యంత పవిత్రమైన శబరిమల ప్రసాద వితరణ నిలిచిపోయింది. అరవణ ప్రసాదంగా పిలిచే ఈ ప్రసాదం ఉత్పత్తిని నిలిపివేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది.
అన్నవరం ప్రసాదం, అరవణ ప్రసాదం ఒక్కటే అంటారు చాలామంది తెలుగు భక్తులు. రుచి, పవిత్రత విషయంలో ఈ రెండూ రెండే. అలాంటి అరవణ ప్రసాదంలో ఉపయోగించే యాలకుల్లో పురుగు మందుల అవశేషాలు, పరిమితిని మించి రసాయనాలు ఉన్నాయనే విషయాన్ని ఓ నివేదిక బయటపట్టింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు ప్రసాదం తయారీ, అమ్మకాల్ని నిలిపేసింది.
ఏటా యాలకుల టెండర్ ను అయ్యప్ప స్పైసెస్ అనే కంపెనీకి ఇస్తుంది ట్రావెన్ కోర్ బోర్డు. అయితే ఈసారి మాత్రం ఆ కాంట్రాక్ట్ ను వేరే సప్లయర్ కు ఇచ్చింది. ఈ కాంట్రాక్ట్ అక్రమంగా జరిగిందని, పైగా నాణ్యత కూడా పరిశీలించలేదంటూ అయ్యప్ప స్పైసెస్ కంపెనీ ఆరోపించింది.
కంపెనీ ఆరోపణల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పరీక్షలు జరిపి.. కొత్త కంపెనీ సరఫరా చేసిన యాలకుల్లో రసయనాలు మోతాదుకు మించి ఉన్నాయని నిర్థారించింది. ఈ నివేదిక ఆధారంగా హైకోర్టు, ప్రసాద తయారీని నిలిపేసింది.
అయితే భక్తుల రద్దీ, వాళ్ల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని యాలకులు లేకుండా ప్రసాదాన్ని తయారుచేసుకోవచ్చని, లేదా ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలకు లోబడి కొనుగోలు చేసిన యాలకులతో ప్రసాదం చేసుకోవచ్చని కోర్టు సూచించింది.
కోర్టు నిర్ణయంతో ఆల్రెడీ తయారైన 6 లక్షల డబ్బాల అరవణ ప్రసాదం వృధా కానుంది. మరోవైపు కోర్టు ఆదేశానుసారం వీలైనంత త్వరగా కొత్త ప్రసాదాన్ని తయారుచేయించాలని ట్రావెన్ కోర్ బోర్డ్ నిర్ణయించింది. ఈ మేరకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.