టెన్త్ క్లాస్ లో ఫెయిలైన వారికి 10 గ్రేస్ మార్కులు కలపండి అంటూ డిమాండ్ చేస్తున్నారు పవన్ కల్యాణ్. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. 2024లో ఓడిపోతే.. గ్రేస్ సీట్లు అడుగుతావా పవన్ అంటూ సెటైర్లు పేలుతున్నాయి.
పదో తరగతి పిల్లాడికి గ్రేస్ మార్కులు వేసినట్టు, తనకు కూడా 10 గ్రేస్ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడేమో.. తనతో పాటు ఓడిపోయిన మిగతా జనసేన అభ్యర్థులందరికీ చెరో గ్రేస్ సీటు కావాలని డిమాండ్ చేస్తాడేమో అనే జోకులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గ్రేస్ మార్కులు ఎందుకిస్తారు..?
ఎక్కడైనా ప్రశ్న తప్పుగా ఇచ్చినప్పుడు, బిట్ పేపర్లో ఆప్షన్లు తప్పుగా ఉన్నప్పుడు.. విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడం పరిపాటి. కానీ ఇక్కడ ఫెయిలైనవారందరికీ 10 గ్రేస్ మార్కులు ఇవ్వాలని పవన్ డిమాండ్ చేయడం నిజంగా విడ్డూరం.
ఓ విద్యార్థికి 25 మార్కులు వచ్చి ఫెయిలయ్యాడనుకుందాం. 10 గ్రేస్ మార్కులి ఇచ్చి పాస్ చేస్తే సంతోషిస్తాడు. మరి 24 మార్కులు వచ్చి ఫెయిలైన విద్యార్థి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది. తనతోపాటు ఫెయిలైన విద్యార్థి పాసయ్యాడని సంతోషిస్తాడా, ఒక్కమార్కుతో తనకు ఆ ఛాన్స్ మిస్ అయిందని బాధపడతాడా..?
అసలు పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్యూర్ పర్సంటేజీ ఎక్కువగా ఉందని, గ్రేస్ మార్కులు కలిపే సాంప్రదాయం ఎక్కడైనా ఉందా..? ఇలాంటి వారి చేతుల్లోకి అధికారం వెళ్తే, ఇలాంటి వారు విద్యా విధానంలో చొరబడితే.. రాష్ట్ర భవిష్యత్తే గందరగోళంగా మారిపోతుందనే విమర్శలు వినపడుతున్నాయి. అందుకే పవన్ కి కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకకుండా ప్రజలు తీర్పునిచ్చారని విమర్శిస్తున్నారు నెటిజన్లు.
వైసీపీ నుంచి కూడా సెటైర్లు
గ్రేస్ మార్కుల వ్యవహారంతో పవన్ పూర్తిగా విమర్శలపాలవుతున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు, టెన్త్ రిజల్ట్ విషయంలో ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని చూసి ఇరుకునపడ్డారు. ఇప్పుడిక పవన్ వంతు వచ్చింది. ఆయన గ్రేస్ మార్కులంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దాని బదులు ఆల్ పాస్ అంటే బాగుండేదేమో.. పదో తరగతి కాబట్టి పది మార్కులు కలపాలన్నారని కూడా పవన్ పై సెటైర్లు పడుతున్నాయి.
పరీక్ష పేపర్లు తయారు చేసింది, కరెక్షన్ చేసింది టీచర్లేనని, పవన్ కల్యాణ్ పొరపాటుగా వైసీపీ నేతలు ఆ పని చేశారని అనుకుంటున్నారని, అందుకే గ్రేస్ మార్కులు కలపాలంటున్నారని ఎద్దేవా చేశారు పేర్ని నాని. పవన్ కల్యాణ్ కూడా పదో తరగతి ఫెయిలయ్యారని, అందుకే ఆయనకి ఫెయిలైన విద్యార్థులంటే అభిమానం ఎక్కువని చురకలంటించారు.
గ్రేస్ మార్క్ ల వ్యవహారం, గ్రేస్ సీట్ల వరకు వచ్చింది. సొంతంగా ఎన్నికల్లో గెలవలేని పవన్, ఇలా గ్రేస్ సీట్లతో సరిపెట్టుకుంటారేమోనని అంటున్నారు నెటిజన్లు.