బాలీవుడ్ లో మరో డిజాస్టర్

బాలీవుడ్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. భారీ సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్లు అవుతున్నాయి. మొన్నటికిమొన్న కంగనా రనౌత్ నటించిన సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అంతకంటే ముందు పలు చిత్రాలు ఓపెనింగ్స్ కూడా…

బాలీవుడ్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. భారీ సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్లు అవుతున్నాయి. మొన్నటికిమొన్న కంగనా రనౌత్ నటించిన సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అంతకంటే ముందు పలు చిత్రాలు ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేకపోయాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో పెద్ద సినిమా చేరింది. అదే పృధ్వీరాజ్.

స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో మరో డిజాస్టర్ గా మిగిలింది. విడుదలైన మొదటి  వారాంతం ఈ సినిమాకు ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చినప్పటికీ, నాలుగో రోజు నుంచి సినిమా అమాంతం డ్రాప్ అయింది. ఐదో రోజు అయితే ఏకంగా జీరో ఆక్యుపెన్సీతో వందల కొద్దీ షోలు రద్దయ్యాయి. అలా ఫస్ట్ వీకెండ్ వచ్చిన ఓపెనింగ్స్ తోనే ఈ సినిమా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ సినిమాకు భారీగా ప్రచారం నిర్వహించారు. పైగా దేశ ఔన్నత్యాన్ని చాటే చిత్రంగా పేర్కొంటూ పన్ను మినహాయింపులు కూడా ఇచ్చారు. ప్రచారం టైమ్ లో ఈ సినిమా చుట్టూ దేశభక్తిని రగిల్చే ప్రయత్నం చేశారు. స్వయంగా అమిత్ షా ఈ సినిమాకు ఆశీస్సులు అందించారు. ఇంత చేసినప్పటికీ పృధ్వీరాజ్ ను బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరించలేదు. అక్షయ్ కుమార్ సినిమా కావడంతో మొదటి 3 రోజులు ఆడింది. లేదంటే మొదటి రోజుకే దుకాణం సర్దేసిన సినిమా ఇది.

ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని బాలీవుడ్ మేకర్స్ అంచనా వేయలేకపోతున్నారు. ఓవైవు పుష్ప, కేజీఎఫ్-2 లాంటి సౌత్ సినిమాలు నార్త్ లో బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తుంటే.. బాలీవుడ్ సినిమా మాత్రం ఆ స్థాయిని అందుకోలేకపోతోంది. ఉన్నంతలో ఈమధ్య వచ్చిన భూల్ బులయా-2 మాత్రమే మెరిసింది. కరోనా తర్వాత బాలీవుడ్ నుంచి వచ్చిన తొలి బ్లాక్ బస్టర్ ఇదే.