ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యర్థి మళ్లీ ఎస్వీ సతీష్‌రెడ్డేనా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ప్రస్తుత పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ బీటెక్ రవిపై అసంతృప్తితో ఆ పార్టీకి చెందిన మండల, గ్రామస్థాయి నాయకులు సతీష్‌రెడ్డిని కలవడం ప్రాధాన్యం ఏర్పడింది. టీడీపీలో చేరడానికి సతీష్‌రెడ్డి సానుకూల సంకేతాలు ఇవ్వడంతో, రానున్న ఎన్నికల్లో మళ్లీ పాత నాయకుడే జగన్ ప్రత్యర్థి అవుతారనే చర్చకు తెరలేచింది.
ఎస్వీ సతీష్‌రెడ్డి… పులివెందులలో వైఎస్ కుటుంబంపై తలపడే నేతగా గుర్తింపు పొందారు. గెలుపోటములతో సంబంధం లేకుండా వైఎస్ కంచుకోటలో వారికి ఎదురొడ్డి నిలిచే దమ్మున్న నాయకుడిగా సతీష్‌రెడ్డి రాజకీయాలు చేశారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమితో నాయకులు చెల్లాచెదరయ్యారు. అలాంటి వారిలో పులివెందుల టీడీపీ నాయకుడు ఎస్వీ సతీష్‌రెడ్డి ఒకడు.
1999, 2004, 2009లలో వైఎస్ రాజశేఖరరెడ్డిపై సతీష్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్‌తో సతీష్‌రెడ్డి తలపడ్డారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో సతీష్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చింది. మండలి డిప్యూటీ చైర్మన్ పదవి కట్టబెట్టి తగిన గౌరవం ఇచ్చిందనే చెప్పాలి. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు, లోకేశ్ తనను అవమానించారంటూ సతీష్‌రెడ్డి పార్టీని వదిలి వెళ్లారు. అప్పటి నుంచి సొంత పనులు చేసుకుంటూ రాజకీయంగా దూరంగా ఉంటున్నారు.
అయితే రాష్ట్రంలో ఎన్నికల సీజన్ మొదలు కావడంతో మళ్లీ నేతలు అప్రమత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో సతీష్‌రెడ్డిని పలువురు టీడీపీ నేతలు కలిసి చర్చించడంపై చర్చకు దారి తీసింది. బీటెక్ రవి సొంత పార్టీ వాళ్లనే తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మీరే పార్టీని నడిపించాలని సతీష్‌రెడ్డిని పులివెందుల టీడీపీ నాయకులు కోరడం విశేషం.
సతీష్‌రెడ్డి స్పందిస్తూ పార్టీలో సముచిత స్థానం కల్పించి మళ్లీ ఇన్‌చార్జిగా తననే నియమిస్తే పార్టీలో చేరతానని సతీష్‌రెడ్డి తేల్చి చెప్పారు. దీంతో టీడీపీ అధిష్టానానికి సతీష్‌రెడ్డి పరోక్షంగా పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ సంకేతాలు పంపారు. పులివెందుల నియోజకవర్గంలో సతీష్‌రెడ్డి కుటుంబానికి మంచి పేరు ఉంది.
వైఎస్ కుటుంబానికి ఎదురొడ్డి నిలబడే ఏకైక నాయకుడిగా సతీష్‌రెడ్డి పేరే ఎవరైనా చెబుతారు. ఏమీ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షమైన చందంగా… పులివెందుల్లో టీడీపీకి ఎవరూ సరైన నాయకుడు లేకపోవడంతో బీటెక్ రవిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. సింహాద్రిపురం మండలం కసనూరు రవి స్వస్థలం. ఈయన సొంతూరికి తక్కువ, మండలానికి ఎక్కువ. అందువల్లే సతీష్‌రెడ్డి పార్టీలోకి వెళితే, మళ్లీ ఆయన్నే జగన్ ప్రత్యర్థిగా టీడీపీ బరిలో నిలిపే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది.