శ్రీకాకుళం జిల్లా రణస్థలం రాజకీయ రణస్థలంగా మారనుందా అంటే అవును అనే చెప్పాలేమో. రణస్థలంలో ఈ నెల 12న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి పేరిట ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఆ రోజున వివేకానందుడి జయంతి కావడంతో యువత కోసం జనసేన అంటూ పవన్ ఈ మీటింగ్ పెడుతున్నారు.
ఈ మీటింగ్ కి అన్ని ప్రాంతాలా నుంచి భారీ ఎత్తుల జనసమీకరణ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఏపీలో చంద్రబాబు సభలకే జనసమీకరణ జరిగి తొక్కిసలాటలో 11 మంది మరణించారు. పవన్ సినిమా హీరో కూడా కావడంతో ఆయన సభకు జనం పోటెత్తితే తొక్కిసలాట ఖాయమనే అభిప్రాయం పోలీస్ వర్గాలలో ఉంది.
ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 1 ని విడుదల చేసింది. దీని ప్రకారం సభలను మైదాన ప్రాంతాలలో పెట్టుకోవాలని, రోడ్డు పక్కన మీటింగ్స్ వద్దు, రోడ్ షోలు అసలే వద్దు అని చెబుతోంది. ఈ మేరకు ఎలాంటి అనుమతులు అడిగినా పోలీసులు ఇవ్వరనే అంటున్నారు.
దీంతో రణస్థలంలో ఈ నెల 12న యువశక్తి సభ విషయంలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పోలోమంటూ జనాలు ఒక్క చోట పోగు అయితే వారిని కంట్రోల్ చేయడం చాలా కష్టమనే అంటున్నారు. యువశక్తి సభకు ఇప్పటిదాకా పోలీసుల నుంచి అనుమతి లభించలేదని అంటున్నారు.
దీని మీద ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ విపక్ష పార్టీల సభలను అడ్డుకునేందుకే చీకటి జీవోలను తెస్తున్నారు అని విమర్శించారు. అయితే సభల వల్ల ప్రజల ప్రాణాలు పోకుండా చూసేందుకే అని అధికార పక్షం నేతలు బదులిస్తున్నారు. మరి కొద్ది రోజులలో పవన్ సభ జరగనున్న నేపధ్యంలో జీవో నంబర్ 1 ప్రకారం నిబంధలను పాటించి విశాలమైన స్థలంలో అక్కడ సంఖ్యకు తగినట్లుగా జనసేన సభను నిర్హహించుకుంటుందా లేక వచ్చిన వారిని వచ్చినట్లుగా సభకు అనుమతిస్తూ కిటకిటలాడిస్తుందా అన్నది చూడాలంటున్నారు. అలా కనుక సభకు పెట్టాలనుకుంటే పోలీసులు నో పర్మిషన్ అనే అంటారని చెబుతున్నారు.