ఈ మధ్యనే విశాఖ వచ్చి రెండు రోజుల పాటు ఒక హొటల్ గదిలో గడిపి విజయవాడ వెళ్ళిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విశాఖ వచ్చే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అది కూడా తొందరలోనే ఆయన విశాఖ టూర్ పెట్టుకుంటారని, ఈ మధ్య కాలంలో జనసేనాని విశాఖ వచ్చి వెళ్ళిన తరువాత రాజకీయ వేడి పెరిగింది. జనసేన అలా జనంలో నానింది. ఆ వేడి అలా చల్లారకుండానే మరో దఫా టూర్ వేయాలని ఆయన భావిస్తున్నారు అంటున్నారు.
విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో మంత్రుల మీద దాడి చేశారని పోలీసులు కేసులు పెట్టి తొమ్మిది మందిని రిమాండ్ లోకి తీసుకున్నారు. ఇపుడు వీరందరికీ బెయిల్ వచ్చింది. అలాగే కొందరు కీలక నేతలకు అరెస్ట్ చేయకుండా ఊరట దక్కింది. అంటే విశాఖలో పవన్ అక్టోబర్ నవంబర్ లో అడుగు పెట్టకముందు ఉన్నట్లుగానే జనసైనికులు అంతా ఇపుడు ఏ రకమైన జైలు గొడవలు లేకుండా ఇంటికి చేరుకున్నారన్న మాట.
దాంతో పవన్ వారిని వారి కుటుంబాలను పరామర్శించడానికి విశాఖ వస్తారని అంటున్నారు. విశాఖలో జనవాణి ప్రోగ్రాం తన పార్టీ వారు లేకుండా చేయనని నాడు మీడియా ఎదుట చెప్పిన మేరకు ఆపేశారు. పనిలో పనిగా ఇపుడు జనవాణి కార్యక్రమం కూడా ఆటంకాలు లేకుండా జరుపుకోవాలని చూస్తున్నారుట.
విశాఖలో రెండు రోజులు హొటల్ గదికే పరిమితం అయిన పవన్ నాడు అరెస్ట్ అయిన వారిని పలకరించలేకపోయారు. దీని మీద విమర్శలు కూడా వచ్చాయి. అందువల్ల ఇపుడు పరామర్శ యాత్ర పేరిట వారి కుటుంబాలను సైతం పలకరిస్తారు అని అంటున్నారు. మళ్ళీ విశాఖలో పవన్ టూర్ అంటే పోలీసులు అప్రమత్తం కావాల్సిందేనేమో.