అప్పుడు విడాకులు, ఇప్పుడు క‌లుసుకోవాల‌ని!

ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య డైలాగ్ వార్ తీవ్ర‌స్థాయిలో జ‌రుగుతోంది. బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తాయ‌ని, ఆ మూడు పార్టీలు ఒక్క‌టే అని వైసీపీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది.…

ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య డైలాగ్ వార్ తీవ్ర‌స్థాయిలో జ‌రుగుతోంది. బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తాయ‌ని, ఆ మూడు పార్టీలు ఒక్క‌టే అని వైసీపీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. ఈ మూడు పార్టీల క‌ల‌యిక రాజ‌కీయంగా లాభం ఎవ‌రికి? న‌ష్ట‌మెవ‌రికి? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఆ మూడు పార్టీలు క‌లిసి పోటీ చేస్తే, మ‌రోసారి వైఎస్ జ‌గ‌నే సీఎం అవుతార‌ని సీపీఐ జాతీయ నాయ‌కుడు కె.నారాయ‌ణ తేల్చి చెప్పారు.

బీజేపీతో పొత్తు కుదుర్చుకోవ‌డం వ‌ల్ల టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌కు ముస్లింలు, క్రిస్టియ‌న్ మైనార్టీలు, అలాగే ద‌ళితులు ఓట్లు వేసే ప్ర‌శ్నే వుండద‌ని నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో పొత్తుల‌పై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. ఇదే విష‌యాన్ని త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ అనేక సంద‌ర్భాల్లో చెప్పారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు.

విపక్ష పార్టీలు 2014 లో క‌లిసి పోటీ చేసి, ఆ త‌ర్వాత విడాకులు తీసుకున్నాయ‌ని వెట‌క‌రించారు. మళ్ళీ 2024 లో కలిసి పోటీ చేస్తాయేమో అని అన్నారు. కానీ తాము మాత్రం సింగిల్‌గానే బ‌రిలో నిలుస్తామ‌ని ఆయ‌న అన్నారు. త‌మ‌కు ప్ర‌జాబ‌లం, దేవుని ఆశీస్సులు ఉన్నాయ‌న్నారు. జ‌గ‌న్‌కు జ‌నం జేజేలు కొడుతున్నార‌న్నారు.

పొత్తుల‌నేవి రాజ‌కీయంగా శ‌క్తి హీనుడైన చంద్ర‌బాబుకు అవ‌స‌ర‌మ‌న్నారు. పొత్తుల్లేక‌పోతే ఎన్నిక‌ల‌కు వెళ్లే ధైర్యం చంద్ర‌బాబుకు లేద‌న్నారు. తాము ప్రజలకు మంచి చేశామని.. సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన అందిస్తున్నారన్నారు. రాయలసీమకు మంచి చేసిందెవ‌రో ప్రజలకు తెలుసని పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు.