మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య తీవ్రస్థాయిలో డైలాగ్ వార్ జరుగుతోంది. ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఈనాటిది కాదు. ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన నాయకులు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం వేదికగా ఇద్దరూ రాజకీయ ప్రవేశం చేశారు. ఆ తర్వాత కాలంలో ఇరువురు ప్రత్యర్థులుగా వేర్వేరు పార్టీల్లో కొనసాగుతూ వస్తున్నారు.
తాజాగా ఇద్దరి మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నడుస్తోంది. పీలేరు సభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డిని పాపాల మంత్రిగా విమర్శించారు. రానున్న ఎన్నికల్లో పెద్దిరెడ్డిని ఓడించితీరుతామని చంద్రబాబు శపథం చేశారు. బాబు విమర్శలకు పెద్దిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సిగ్గు లేకుండా తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మితి మీరిన విమర్శలు చేస్తున్నారని అన్నారు. “నన్ను పాపాల పెద్దిరెడ్డి అంటావా? నీలాగా మామకు వెన్నుపోటు పొడిచానా?” అని ఆయన నిలదీశారు. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రారని మంత్రి తేల్చి చెప్పారు. కనీసం కుప్పంలో కూడా బాబు గెలవలేరని ఆయన జోస్యం చెప్పారు.
కుప్పానికి తాము నీళ్లు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పానికి ఏం చేశావని మంత్రి నిలదీశారు. రాజకీయంగా చూసుకోక, చౌకబారు విమర్శలకు దిగుతున్నాడని బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఏది పడితే అది మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. చంద్రబాబు మోసకారి మాటలు నమ్మొద్దని ఆయన అన్నారు. కుప్పంతో సహా రాష్ట్రంలో ఎక్కడా టీడీపీని గెలవనీయమని ఆయన వార్నింగ్ ఇచ్చారు. చౌకబారు విమర్శలు గుప్పిస్తే ప్రజలే రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.