టీడీపీలో మరో వైసీపీ ఎమ్మెల్యే చేరనున్నారు. తిరుపతి ఎంపీ సీటు ఇచ్చినా, వైసీపీపై తిరుగుబాటు బావుటాను సత్యవేడు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎగురవేసిన సంగతి తెలిసిందే. వైసీపీలో రిజర్వ్డ్ సీట్లలో మాత్రమే అభ్యర్థుల్ని మారుస్తున్నారని, తన నియోజక వర్గ ఆత్మీయ సమావేశానికి కనీసం తనకు ఆహ్వానం కూడా లేదని ఆయన వాపోయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీలో చేరనున్నట్టు తెలిసింది. మాజీ మంత్రి, చిత్తూరు జిల్లాకు చెందిన అమర్నాథ్రెడ్డితో కలిసి కారులో ఆయన నెల్లూరుకు వెళ్లినట్టు తెలిసింది. బాబు చేతుల మీదుగా ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు.
వైసీపీలో అభ్యర్థుల ఎంపిక కొందరికి తీవ్ర నిరాశ మిగిల్చుతోంది. దీంతో టికెట్లు దక్కని నేతలు టీడీపీ లేదా జనసేనలో చేరుతున్నారు. ఆ రెండు పార్టీలు ఇంకా అభ్యర్థుల ప్రకటన జోలికెళ్లలేదు. కానీ టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్లు, నియోజకవర్గాల కేటాయింపుపై రకరకాల ప్రచారం జరుగుతోంది. అవి తేలితే ఆ రెండు పార్టీల్లో ఎలా వుంటుందో చెప్పలేని పరిస్థితి.
ఇదిలా వుండగా తిరుపతి ఎంపీ సీటు కూడా కాదనుకుని టీడీపీలో చేరుతున్న ఆదిమూలానికి చంద్రబాబు ఏమిస్తారనే ప్రశ్న ఉత్పన్నమైంది. సత్యవేడులో ఇప్పటికే టీడీపీ ఇన్చార్జ్ ఉన్నారు. వారెవరినీ కాదని ఆదిమూలానికి టికెట్ ఇస్తారా? అంటే… అంత సీన్ లేదని టీడీపీ చెబుతోంది. అయినా టీడీపీలో చేరడానికే ఆదిమూలం మొగ్గు చూపడం సర్వత్రా చర్చనీయాంశమైంది.