స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి కేసులో చంద్రబాబునాయుడు అరెస్ట్ అయితే, నిన్న టీడీపీ శ్రేణులు నవ్వుకుంటూ విజిల్స్, డప్పు మోత మోగించారని విమర్శించారు. టీడీపీ నేతల్లో ఆనందం తాండవిస్తోందని వెటకరించారు.
బాబు అరెస్ట్ అయ్యాడనే బాధ ఏ ఒక్క టీడీపీ నేతలోనూ కనిపించలేదని పేర్ని అన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదైతే కోర్టుల్లో ఎందుకు ఆయనకు అనుకూల తీర్పులు రావడం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. టీడీపీ అంతర్జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు లంచాలు మేసి కంచాలు మోగిస్తున్నారని చురకలు అంటించారు.
టీడీపీలో కోటి మంది కేడర్ ఉన్నారని చెప్పుకుంటారని, మరి వాళ్లంతా నిన్న డప్పు కొట్టకుండా ఎక్కడికెళ్లారని ఆయన నిలదీశారు. తమ సొమ్మును చంద్రబాబు నొక్కేశారని ప్రజలు అనుకుంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు చేసిన పాపాలు, ఘోరాలే ఆయన్ను వెంటాడుతున్నాయని పేర్ని అన్నారు. చేసిన పాపాలకు చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని పేర్ని హెచ్చరించారు. కాపులకు రిజర్వేషన్ ఇస్తానని మాట చెప్పి, వారిని మోసగించారని ఆయన విమర్శించారు.
ప్రత్యేక హోదా కోసం రోడ్డెక్కితే జైల్లో వేస్తానని నాడు ప్రజల్ని చంద్రబాబు హెచ్చరించారని పేర్ని గుర్తు చేశారు. ఇప్పుడు తాను అవినీతిలో దొరికితే అందరూ రోడ్డు మీదకి రావాలని పిలుపునిస్తున్నారని తప్పు పట్టారు. నాడు కాంగ్రెస్‌తో చేతులు కలిపి రాజకీయంగా జగన్ లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రపన్నారని గుర్తు చేశారు. కన్న తండ్రి జైల్లో వుంటే లోకేశ్ ఢిల్లీలో ఎందుకు కులుకుతున్నాడని ఆయన ప్రశ్నించారు.
కేసులు ఎన్ని ఎక్కువగా పెట్టించుకుంటే అంత పెద్ద పదవులు ఇస్తానని కేడర్‌ను లోకేశ్ ప్రోత్సహించారని, ఇప్పుడు తన వరకూ వచ్చేసరికి ఎందుకు గగ్గోలు పెడుతున్నారని పేర్ని నిలదీశారు. లోకేశ్‌కు పదవులు వద్దా? అని ఆయన ప్రశ్నించారు. జగన్‌పై పెట్టిన కేసులు అక్రమమని ప్రజలు నమ్మారు కాబట్టే ఆయన్ను గెలిపించారన్నారు. ఐఏఎస్ అధికారులు, మంత్రులు తప్పులు చేయనప్పుడు, ఇక జగన్‌కు ఏంటి సంబంధమని ఆయన ప్రశ్నించారు. ఒకట్రెండు సంవత్సరాలు ఆలస్యం కావచ్చేమో కానీ, తప్పుడు కేసుల నుంచి వైఎస్ జగన్ వజ్రంలా బయటికొస్తారని పేర్ని అన్నారు.