పగటి పూట సూర్యభగవానుడి తేజోమయ కాంతిలో చుక్కలు కనిపించవు. రాత్రి చీకటి పడితే తప్ప ఆకాశంలో నక్షత్రాలను చూడలేం. అలాంటిది పట్టపగలే జనసేనానికి ఆకాశంలో చుక్కలు కనిపిస్తున్నాయి. పగలే ఆకాశంలో నక్షత్రాలను చూపుతున్న ఘనత ఒకే ఒక్క నాయకుడికి దక్కుతుంది. ఆ ఒక్కడే మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని. పవన్‌కు, జనసేన శ్రేణులకు కొరకరాని కొయ్యగా పేర్ని నాని తయారయ్యారు.
కేవలం పేర్ని నానీని తిట్టేందుకే మచిలీపట్నంలో జనసేన పదో వార్షికోత్సవ సభ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. మరికొన్ని గంటల్లో జరిగే సభలో పవన్‌కల్యాణ్ తన సామాజిక వర్గానికి చెందిన ప్రత్యర్థి నాయకుడు పేర్ని నానిని ఏ స్థాయిలో తిడతారో తెలియదు. కానీ పవన్‌పై పేర్ని మాత్రం ఎటాక్ స్టార్ట్ చేశారు. రాజకీయాల్లో ఆస్కార్ ఇవ్వాల్సి వస్తే, ప్రతి దఫా పవన్‌కల్యాణ్‌కే ఇవ్వాలని అదిరిపోయే సెటైర్‌ను పేర్ని విసిరారు.
తాజాగా మరోసారి పవన్‌పై నాని తన మార్క్ పంచ్‌లతో విరుచుకుపడడం విశేషం. బందర్‌లో జనసేన సభను తస్మదీయ దూషణ సభగా పేర్ని అభివర్ణించారు. కేవలం చంద్రబాబు మేలు కోసమే రాజకీయం చేస్తున్నట్టు పవన్ చెబుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు. ఇప్పటం నుంచి నేటి మచిలీపట్నం సభ వరకూ ఏమీ తేడా లేదని ఆయన చెప్పుకొచ్చారు. జగన్‌కు మద్దతుగా నిలిచే కాపు నాయకుల్ని తిట్టేందుకు, అలాగే చంద్రబాబును బలపరిచేందుకే బందర్‌లో సభ పెట్టాడని పేర్ని తేల్చి చెప్పారు.
చంద్రబాబుకు కాపు కులాన్ని, కులస్తులను తాకట్టు పెట్టేందుకు పవన్ ప్రయత్నిస్తున్నాడని విరుచుకుపడ్డారు. పవన్ రాజకీయ సినిమా ఫ్లాప్ లేదా హిట్ అయిన పెద్దగా నష్టం లేదని దెప్పి పొడిచారు. ప్యాకేజీ స్టార్ అంటే పవన్‌కు ఇష్టం లేదు కానీ.. స్టార్ ప్యాకేజీ అంటే ఇష్టమని పేర్ని కుళ్ల పొడిచారు.
పేర్నిని పవన్ ఎన్ని రకాలుగా అయినా విమర్శించొచ్చు. కానీ పవన్‌ను కుళ్ల పొడిచే ఏకైక నాయకుడిగా పేర్ని నాని ప్రాచుర్యం పొందుతున్నారు. పవన్‌కల్యాణ్ ఎన్నైనా మాట్లాడొచ్చు కానీ, పేర్నికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే పేర్ని విమర్శల్లో వాస్తవికత ఉంది.
పవన్ మాటల్లో మోసకారితనం, వంచన ఉన్నాయి. నిజాల్ని దాచి, తనను అభిమానించే వారిని సైతం మభ్య పెట్టేందుకే పదేళ్లుగా రాజకీయం చేస్తున్నారు. అందుకే ఆయన ప్రజాదరణ పొందలేకపోతున్నారనేది చేదు నిజం. అది గ్రహించి తన రాజకీయ పంథాను మార్చుకుంటేనే పవన్‌కు భవిష్యత్. లేదంటే ఇలా రోజూ పేర్ని నాని, ఇతర ప్రత్యర్థి నాయకుల చేతిలో విమర్శలకు గురి కావాల్సి వుంటుంది.