విషం అనేది ఒక రాజకీయ విత్తనంగా మారిపోయిన దుర్మార్గపు రోజులు ఇవి! విద్వేషం అనేది రాజకీయంగా బలం పుంజుకోవడానికి ఒక అత్యద్భుతమైన ఆయుధంగా మారిపోయిన ఘోరమైన రోజులు ఇవి! ఇందులో ఏ పార్టీలను కూడా మినహాయించవలసిన అవసరం లేదు. ఎవరి స్థాయిలో వారు తమ తమ ప్రత్యర్థుల మీద ప్రజలలో ఎంతో కొంత విష, విద్వేష బీజాలను నాటడానికి.. తద్వారా తాము మనుగడ సాగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. దాని వలన రాగల పర్యవసానాలను దుష్పరిణామాలను ఏమాత్రం అంచనా వేయలేకపోతున్నారు.
విషం విద్వేషం రాజకీయం బాటలుగా మారిపోయిన సమయంలో.. ప్రత్యేకంగా ఇప్పుడే ఎందుకు ప్రస్తావనలోకి వచ్చింది అంటే అందుకు కారణం ఉంది! హనుమకొండలో వైద్య కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. తన సరికొత్త సీరియస్ ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీని నిందించడానికి వాళ్లు ప్రజలలో విష బీజాలు నాటుతున్నారని ఆరోపణలు గుప్పించారు!
కెసిఆర్ మాటలు ఒక రకంగా నిజమే కావచ్చు! కానీ అవకాశం ఉన్నప్పుడు.. ప్రత్యర్థి అలాంటి అవకాశాన్ని ఇస్తున్నప్పుడు.. వారి మీద ప్రజలలో విష బీజాలు నాటడానికి ప్రయత్నించని వాళ్ళు ఎవరు?
కేవలం విషాన్ని విద్వేషాన్ని చల్లడం ద్వారానే రాజకీయంగా ఒక మెట్టు ఎదగగలం అనే ప్రయత్నాలు చేయకుండా ఉన్నది ఎవరు? దానివలన ప్రజలు కొట్టుకు చచ్చే పరిస్థితులు ఏర్పడినా సరే ఆ మంటలలో చలికాచుకోవాలనే ధోరణి తప్ప తగలబడిపోతుంది.. అనే ఆలోచన చేయకుండా ముందుకు సాగిపోయే వారే… అంతా!
భారతీయ జనతా పార్టీ మతం ప్రాతిపదికగా దేశంలో నాటుతున్న విష బీజాల గురించి ఇప్పుడు నిందలు వేయడంలో కేసీఆర్ కు లాభం కనిపిస్తుంది. కానీ ఇక్కడ కీలకంగా గమనించాల్సిన.. గతించిపోయిన పాత అంశం ఒకటి ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పుడు కేసీఆర్ చేసిన పని ఏమిటి? సీమాంధ్రుల మీద ఆయన ఎలాంటి విషాన్ని కక్కారు? యావత్ తెలంగాణలో ఉన్న సీమాంధ్రులు అందరూ కూడా తమ తమ ఆస్తులను అయినకాడికి అమ్ముకొని సొంత ప్రాంతాలకు పారిపోయే భీతావహవాతావరణాన్ని ఆయన కల్పించలేదా?
తెలంగాణలో పూర్తిగా స్థిరపడిపోయి, వేరే గత్యంతరం లేని సీమాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతకవలసిన రోజులను కేసీఆర్ స్వయంగా సృష్టించలేదా? ఆయన మాటలకు రెచ్చిపోయిన అమాయక తెలంగాణ ప్రజలు చెదురుమదురుగా సీమాంధ్రుల మీద దాడులు చేసిన దుర్ఘటనలు లేవా? ఇవన్నీ కూడా ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి! విషాన్ని, విద్వేషాన్ని నాటడం ద్వారా మాత్రమే.. తాను రాష్ట్రాన్ని సాధించగలను.. అని కెసిఆర్ ఒక బలమైన సంకల్పం చెప్పుకున్నారు. తదనగుణంగా ఆయన ఆ ప్రయత్నంలో దూసుకెళ్లిపోయారు!
ఆయన నాటిన విషపు విత్తులతో పోలిస్తే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాటుతున్న మత విద్వేషాల విత్తులు ఎక్కువ ప్రమాదకరమైనవా? ఆ మాటకొస్తే మత ప్రాతిపదికన విష ప్రచారాలు జరుగుతున్నవి గనుక.. ఆ ప్రచారాలన్నింటినీ భారతీయ జనతా పార్టీకి ముడి పెట్టవలసినదే తప్ప స్వయంగా ఆ పార్టీ అధినాయకులు నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా లాంటివాళ్ళు మతాల మీద విషాన్ని చిమ్ముతున్న సందర్భాలు లేవు! వారు స్వయంగా దేశ ప్రజలను లేదా హిందువులను రెచ్చగొడుతున్న సందర్భాలు లేవు. కానీ కెసిఆర్ గతంలో చేసిన పనులు అలాంటివి కాదు.. ఆయనే స్వయంగా ఆంధ్రోళ్ల మీదకు జనాన్ని ఉసిగొలిపారు.
అలాంటి చరిత్రను మరిచిపోయి గురివింద గింజ నీతి లాగా ఇప్పుడు ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ మీద నిందలు వేయగల నైతిక హక్కు తనకు ఎలా ఉందని కేసీఆర్ భావిస్తారు? ఇదంతా భారతీయ జనతా పార్టీని సమర్థించడానికో, ముస్లిములకు వ్యతిరేకంగా జరిగే మతాల విష ప్రచారాలని సమర్ధించడానికో కాదు.. ఎదుటి వాళ్ళు విషాన్ని నాటుతున్నారని ఆరోపిస్తున్నప్పుడు తన ప్రవర్తనను కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని సూచించడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే!!
కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించే మాటలు మాత్రమే కాదు దేశ విశాల ప్రయోజనాలను లక్ష్యించే దార్శనిక దృక్పథంతో నిజాయితీగా ముందుకు సాగితే కేసీఆర్ మరింత మంచి నేతగా మన్నన దక్కించుకుంటారు!