‘చంద్రబాబు బ్రాండ్’ మసాలాలు!

వంటకం మామూలుగా ఉంటే రుచించదు.. జనాన్ని ఆకట్టుకోవడం కష్టం. ఉన్నది ఉన్నట్టుగా వండేస్తే ఎవ్వరూ దాని మొహం కూడా చూడరు. అందుకే ఆరోగ్యానికి అవసరం ఉన్నా లేకపోయినా వంటలలో అనేక మసాలాలను దట్టిస్తూ ఉంటారు!…

వంటకం మామూలుగా ఉంటే రుచించదు.. జనాన్ని ఆకట్టుకోవడం కష్టం. ఉన్నది ఉన్నట్టుగా వండేస్తే ఎవ్వరూ దాని మొహం కూడా చూడరు. అందుకే ఆరోగ్యానికి అవసరం ఉన్నా లేకపోయినా వంటలలో అనేక మసాలాలను దట్టిస్తూ ఉంటారు! ఇదంతా కేవలం కిచెన్‌కు పరిమితమైన సిద్ధాంతం ఎంత మాత్రమూ కాదు! దీన్ని రాజకీయాలకు కూడా వర్తింపజేయడంలో చంద్రబాబు సిద్ధహస్తులు! ఒక గొడవ జరిగితే దానికి చిలవలు పలవలు పేర్చి భూతద్దంలో చూపిస్తూ దుర్మార్గమైన ప్రచారం చేయడంలో చంద్రబాబు నాయుడు ఘనాపాటి!.

ఇలాంటి అబద్ధపు ప్రచారాలను భుజాన వేసుకుని తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని ప్రయత్నించే సోషల్ మీడియా బృందాలకు సారధి చింతకాయల విజయ్ విషయంలో చంద్రబాబు నాయుడు మరిన్ని అబద్ధాలు వండుతూ రెచ్చిపోతున్నారు!! జరిగిన ఘటనను జరిగినట్లుగా నివేదిస్తే ప్రజలు కూడా పట్టించుకోరు అనే ఉద్దేశంతో రకరకాల మసాలాలు కూడా వేసి వండుతున్నారు!

చింతకాయల విజయ్ కు 41 ఏ నోటీసులు ఇవ్వడానికి ఏపీ సిఐడి పోలీసులు హైదరాబాదులోని ఆయన నివాసానికి వచ్చారు. నోటీసులు ఇచ్చేందుకు ఇంట్లోకి వెళ్లాలి కనుక లోనికి తీసుకు వెళ్లాల్సిందిగా డ్రైవర్ను అడిగారు. లోనికి వెళ్ళిన తరువాత తమ మీద కొత్తగా నిందలు వేయకుండా ఉండడానికి ఇంట్లో వీడియో కూడా తీశారు. 

అక్కడ చింతకాయల విజయ్ కూతురు ఉంటే ఆ పాపను కూడా పలకరించారు. ఇదీ జరిగిన సంఘటనల క్రమం! అయితే ఈ సంఘటనలను ఇలాగే ప్రజల ముందు మాట్లాడితే మెడ మీద తల ఉన్న ఏ ఒక్కరైనా సరే.. ‘అంతే కదా, పోలీసులు ఎక్కడైనా అలాగే చేస్తారు కదా, అందులో తప్పేముంది’ అని ప్రశ్నిస్తారు! అందుకే చంద్రబాబు తన ప్రత్యేకమైన కిచెన్‌లో దీనికి కొత్త మసాలాలను దట్టిస్తున్నారు!

డ్రైవరును లోపలికి తీసుకు వెళ్ళమని అడిగినందుకు అతని మీద దాడి చేసినట్లుగా ఒక రంగు పులిమే పులిమారు. నిజానికి డ్రైవరు, తన మీద చేయిచేసుకున్నారని మాత్రమే చెప్పినట్టు పత్రికల్లో రాగా.. దానిని కాస్తా ‘దాడి’, ‘పోలీసుల రౌడీయిజం’ అనే పదాల వరకు ఇంప్రొవైజ్ చేసి చంద్రబాబు అండ్ కో రెచ్చిపోతుండడం విశేషం.  

ఇంట్లో పసిపాపను పలకరించినందుకు ఆ బిడ్డను బెదిరించినట్లుగా మరో రంగు పులిమారు. దాడి దాడి అనే పదాలను పదే పదే పలుకుతున్నారు. నోటీసులు ఇవ్వడానికి వచ్చిన పోలీసులను రౌడీల్లాగా వాడుతున్నారంటూ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళు పోలీసుల కాదా కూడా తెలియదంటూ ,వారు రౌడీలేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తూ.. స్థానికంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ద్వారా మరో మసాలా నాటకాన్ని కూడా రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

ఒక చిన్న సంఘటన, పరిణామం జరిగితే.. దాని నుంచి గరిష్టంగా రాజకీయ లబ్ధి పొందడం అనే చవకబారు మసాలా పాలిటిక్స్ కేవలం తన బ్రాండ్ అని చంద్రబాబు నిరూపించుకుంటున్నారు. భార్యను అడ్డుపెట్టుకుని ప్రజల జాలిని పొందాలని ప్రయత్నించిన ఈ ‘చీప్ ట్రిక్స్ నాయకుడు’ ఇవాళ తమ పార్టీ వ్యక్తి కూతురు పసిపాపను అడ్డుపెట్టుకుని మళ్ళీ రాజకీయ లబ్ధి పొందాలని చూడడం హేయం! చంద్రబాబు బ్రాండ్ మసాలాల ఈ చవకబారు ఎత్తుగడలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు!!