పోలవరం బహుళార్థ ప్రాజెక్టు నిర్మాణంపై నాడు చంద్రబాబు ప్రభుత్వం, నేడు జగన్ ప్రభుత్వం ఒకే బాటలో నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సమాజానికి గుండెకాయ లాంటి పోలవరాన్ని పూర్తి చేయండయ్యా అని అధికారం అప్పగిస్తే, ఆ పని చేయకుండా, సమాధి కట్టేలా పాలకులు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత జగన్ ప్రభుత్వం తమ నిస్సహాయతను బహిరంగంగా ప్రకటించడానికి ఏ మాత్రం సిగ్గుపడడం లేదు.
బాపట్ల జిల్లాలో ఇరిగేషన్ పనుల టెండర్ల విషయంలోనూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. తాము ఇచ్చినపుడే బిల్లులు తీసుకునే వాళ్లు మాత్రమే పనులు చేయాలని, కోర్టుకెళ్లడానికి వీల్లేదని ఏకంగా ప్రభుత్వం ప్రకటించి తన నిస్సహాయతను చాటుకుంది. ఈ ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తడంతో తిరిగి వెనక్కి తగ్గింది.
నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై చేతులెత్తేశారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పేందుకు డెడ్‌లైన్ లేదన్నారు. దానికి సుదీర్ఘ సమయం పడుతుందన్నారు. పోలవరం మొదటి దశ ఇంకా పూర్తి కాలేదన్నారు. ఎన్నికల లోపే మొదటి దశను పూర్తి చేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న తరుణంలో డయాఫ్రం వాల్ దెబ్బతినడం ప్రతిబంధకంగా మారిందని, దీని వల్లే ప్రాజెక్టు ఆలస్యమవుతోందని చెప్పుకొచ్చారు.
అసెంబ్లీ వేదికగా గత నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పోలవరంపై కీలక ప్రకటన చేశారు. 2021, డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగానే పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తామని నాటి మంత్రి అనిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంబటి రాంబాబు పోలవరం పూర్తికి డెడ్‌లైన్ ఏదీ లేదని స్పష్టత ఇవ్వడం గమనార్హం.
డయాఫ్రమ్ వాల్‌ను లోపభూయిష్టంగా నిర్మించి పోలవరం ప్రాజెక్టును అధోగతి పాల్జేసింది చంద్రబాబు కాదా అని మంత్రి నిలదీయడం ప్రాధాన్యం సంతరించుకుంది. డయాఫ్రమ్ వాల్ ఎవరి అలసత్వం వల్ల దెబ్బతిన్నదనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలని మంత్రి అంబటి ఆకాంక్షించారు. టీడీపీ ప్రభుత్వం కాఫర్ డ్యామ్ పూర్తికాకుండానే అనాలోచితంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడంతో నగదు వృధాతో పాటు ప్రమాదకర పరిణామంగా మారిందన్నారు.
చంద్రబాబు పాలనలో పోలవరానికి జరిగిన నష్టం ఏంటో అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఏపీ సర్కార్ ఎందుకు చెప్పలేదు? ఇవేం తెలియకుండానే 2021, డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి హోదాలో అనిల్‌కుమార్ ఎలా చెప్పారు? ఇలాంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సిన బాధ్యత ఉంది. అయితే పోలవరాన్ని తాను నిర్మిస్తానని చంద్రబాబు తీసుకోవడంతో చెప్పడంతో సమస్య మొదలైంది.
పోలవరం నిర్మించే బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంది. నిధుల విడుదలకు కూడా కేంద్రం కొర్రీలు వేస్తోంది. ఇలా అన్నీ తోడై పోలవరం అటకెక్కింది. పోలవరం నిర్మాణం వైఎస్సార్ కల. తండ్రి ఆశయాన్ని, కలను నెరవేర్చేందుకు తనయుడు వైఎస్ జగన్ పట్టుదలతో పని చేస్తారని అనుకున్నారు. అయితే అంబటి తాజా ప్రకటనతో ఆశలన్నీ ఆవిరయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.