తగ్గేదేలే.. వైసీపీలో సస్పెన్షన్ల పర్వం మొదలు..?

ఎన్నికలకు రెండేళ్ల ముందుగా వైసీపీలో ప్రక్షాళణ పర్వం మొదలైందా..? వారం రోజుల వ్యవధిలో ఇద్దరు కీలక నేతల సస్పెన్షన్ వ్యవహారం దీన్నే సూచిస్తోంది. మర్డర్ కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్సీ అనంతబాబుని పార్టీనుంచి సస్పెండ్ చేసి…

ఎన్నికలకు రెండేళ్ల ముందుగా వైసీపీలో ప్రక్షాళణ పర్వం మొదలైందా..? వారం రోజుల వ్యవధిలో ఇద్దరు కీలక నేతల సస్పెన్షన్ వ్యవహారం దీన్నే సూచిస్తోంది. మర్డర్ కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్సీ అనంతబాబుని పార్టీనుంచి సస్పెండ్ చేసి వారం తిరక్కుండానే మాజీ మంత్రి కొత్తపల్లిని కూడా సాగనంపారు. అక్రమార్కులకు, ధిక్కార స్వరం వినిపించేవారికి పార్టీలో చోటు లేదని ఓ కీలక సందేశం పంపించారు సీఎం జగన్. రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్ కి కూడా ఫుల్ స్టాప్ పెడితే మరో ముందడుగు వేసినట్టవుతుంది.

ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంపై కొన్నాళ్లుగా విమర్శలు ఉన్నా కూడా రుజువులు లేనందున ఇన్నాళ్లు పార్టీ వేచి చూసింది. చివరకు డ్రైవర్ ని హత్య చేసేందుకు కూడా వెనకాడని మనస్తత్వం అని తేలడంతో ఆయన అరెస్టైన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వాస్తవానికి తప్పుచేసిన వారిని వెనకేసుకొచ్చే ఉద్దేశమే పార్టీ అధినాయకత్వానికి ఉండి ఉంటే.. అనంతబాబు వ్యవహారంలో అరెస్ట్ కానీ, సస్పెన్షన్ కానీ జరిగేవి కావు. టీడీపీ హయాంలో జరిగినట్టు రాజీ జరిగి ఉండేది. 

ఇక కొత్తపల్లి విషయంలో చాలా సార్లు ఆయనకు అవకాశాలిచ్చి చూశారు. బహిరంగ వేదికపై ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసి చెప్పుతో కొట్టుకున్నప్పుడే ఆయన్ను తరిమేయాల్సింది. కానీ వేచి చూశారు. తనని తాను నరసాపురం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించుకోవడంతో వేటు వేశారు. ఇటీవల గన్నవరం అసెంబ్లీ టికెట్ వ్యవహారంలో కూడా అధిష్టానం వంశీకి మద్దతుగా నిలిచింది. అక్కడ వ్యతిరేక వర్గాన్ని కూడగట్టాలనుకున్నవారికి గట్టి వార్నింగ్ ఇచ్చి పంపించేసింది. ఇటీవల నెల్లూరు ఇంటర్నల్ పాలిటిక్స్ ని కూడా అధిష్టానం వెంటనే సరిచేయడం ఇందులో భాగమే.

రఘురామ సంగతేంటి..?

ఆరోపణలు వచ్చినవారిని, తలెగరేసేవారిని అందర్నీ బయటకు పంపుతున్నారు. మరి పక్కలో బల్లెంలా మారి చీటికీ మాటికీ చిర్రెత్తేలా చేస్తున్న రఘురామ సంగతేంటి..? ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయించేందుకు ఇన్నాళ్లూ వైసీపీ ప్రయత్నించింది. పార్టీనుంచి సస్పెండ్ చేస్తే.. స్వతంత్ర ఎంపీగా ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరు. అందుకే పార్టీ నుంచి బయటకు పంపించకుండా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయించాలని పలుమార్లు ఫిర్యాదులు చేశారు వైసీపీ నేతలు. 

కానీ బీజేపీ పరోక్ష మద్దతుతో రఘురామ కాలం నెట్టుకొస్తున్నారు. ఎన్నికల టైమ్ దగ్గరపడిన తర్వాత ఇలాంటి వారిని కూడా ఉపేక్షించి లాభం లేదు.

మొత్తమ్మీద 2019 ఘన విజయం తర్వాత వైసీపీలో పెద్దగా లుకలుకలు బయటపడలేదు. తీరా ఎన్నికల సమయానికి కొంతమంది తలెగరేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. వైసీపీలో ఉంటూ పక్క పార్టీలకు కోవర్టులుగా ఉండేవారిని వదిలించుకోడానికి ఇదే సరైన సమయం. అభ్యర్థుల విషయంలో కూడా కార్యకర్తలకు ముందుగానే క్లారిటీ ఇవ్వడం కూడా మంచిదే.