దివ్యవాణి రాజీనామా చేశారనే వార్త వినగానే.. ఎవరైనా ఎన్నోసారి, ఈసారయినా ట్వీటు మీద నిలబడతారా, లేక మాట చెప్పి రద్దు చేసుకుంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఇది నిజంగా నిజం.
దివ్యవాణి సెల్ఫీ వీడియోతో తన రాజీనామాను ధృవీకరించారు. ఇన్నాళ్లు వైరి వర్గాలపై దుమ్మెత్తిపోసిన వాణి.. ఈరోజు టీడీపీకి చాకిరేవు పెట్టి చంద్రబాబుని ఓ ఉతుకు ఉతకబోతున్నారు.
దివ్యవాణి సెటైర్లు..
అయ్యో.. లోపల మర్యాదలు తట్టుకోలేకపోయాను, యదార్థ స్థితిని భరించలేకపోయానంటూ చంద్రబాబు మీటింగ్ తర్వాత సెటైర్లు వేశారు దివ్యవాణి. పాపం వాణి బుజ్జగింపులు ఉంటాయని బాబు వద్దకు వెళ్లుంటారు. కానీ బాబు సంగతి తెలిసిందేగా.. కరివేపాకువు నువ్వు అని చెప్పి ఉంటారు. దీంతో ఆమె బాగా హర్ట్ అయ్యారు. అందుకే లోపల మర్యాదలు తట్టుకోలేకపోయానంటున్నారు.
బాబు గారు, బాబుగారు అని పదే పదే సెల్ఫీ వీడియోలో సెటైర్లు వేశారు దివ్యవాణి. ఈరోజు ఆ బాబుగారి పరువు బజారుకీడ్చబోతున్నారనమాట. ఇన్నాళ్లు దివ్యవాణి ఆగ్రహావేశాలు జగన్ పై, వైసీపీ నేతలపై చూశాం.. ఇప్పుడు తొలిసారిగా బాబుని దివ్యవాణి ఏ రేంజ్ లో ఉతుకుతుందో చూడబోతున్నాం.
మొన్న ట్రైలర్.. ఈరోజు సినిమానే..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహానాడు అవమానాలను ఏకరువు పెట్టారు దివ్యవాణి, ఆ ఇంటర్వ్యూలో చంద్రబాబుపై పల్లెత్తు మాట అనలేదు. ఆయనకు తెలియకుండానే మధ్యలో వాళ్లు తనకు అన్యాయం చేశారని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా చంద్రబాబుతో భేటీ తర్వాత ఆమె ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు.
రాత్రి మీడియా అందుబాటులో ఉన్నా కూడా టైమ్ సరిపోదని, తన ఇంటర్వ్యూకి సరైన ఫోకస్ రాదని దివ్యవాణి వ్యూహాత్మకంగానే సైలెంట్ గా వెళ్లిపోయారు. ఇప్పుడు ప్రెస్ మీట్ లో పూర్తి స్థాయిలో బాబు బండారం బయటపెట్టబోతున్నారనమాట.
ఇన్నాళ్లూ తనని వాడుకుని వదిలేశారనే విషయాన్ని ఆమె క్లారిటీగా చెప్పబోతున్నారు. మరి ఈ ప్రెస్ మీట్ లో ఇంకేమేం విషయాలు బయటకొస్తాయో చూడాలి.