విశాఖలో ఋషి కొండపై టూరిజం భవనాల నిర్మాణాలు చేపట్టడాన్ని అడ్డుకునేందుకు హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చేసిన ప్రయత్నాలకు సుప్రీం కోర్టు అడ్డుకట్ట వేసింది. పూర్వాపరాలు విచారించకుండా కేవలం రఘురామ రాజు లేఖ ఆధారంగా, రాష్ట్రప్రభుత్వం వాదనలు వినకుండానే, ప్రాజెక్టుపై స్టే యివ్వడం సరికాదంది. ముందుగా చదును చేసిన ప్రాంతంలోస నిర్మాణాలు యిప్పటికే ఉన్న చోట్ల కొత్త నిర్మాణాలు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతిచ్చింది. తవ్వకాలు చేసిన ప్రదేశంలో మాత్రం నిర్మాణాలు చేపట్టవద్దంది. లోతుగా పరిశీలించే బాధ్యతను హైకోర్టుకి అప్పచెప్పింది. నా ఉద్దేశంలో యిది ప్రాక్టికల్ డెసిషన్. తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన 111 జీఓ విషయంలో యిలాటి తీర్పు వస్తుందా, రాదా అనేది ఉత్సుకత కలిగించే విషయం.
కెసియార్ ఏప్రిల్ మధ్యలో తీసుకున్న ప్రధాన నిర్ణయం 111 జిఓ రద్దు. జీఓను 1996లో చంద్రబాబు ప్రభుత్వం విధించింది. ప్రధాన జలాశయాలకు 10 కి.మీ.ల వ్యాసార్థంలో 84 గ్రామాల పరధిలో ఉన్న 1.32 లక్షల ఎకరాలలో స్థలంలో 10శాతం మాత్రమే నిర్మించవచ్చు అని నివాసాలు, నిర్మాణాలపై నియంత్రణ విధించింది. చాలా ఏళ్లుగా ప్రతీ పార్టీ దాని గురించి మాట్లాడుతోంది. తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటోంది. కానీ అధికారంలోకి వచ్చాక నానుస్తోంది. తెరాస కూడా అధికారంలోకి వచ్చి దాదాపు 8 ఏళ్ల తర్వాత రద్దు నిర్ణయం తీసుకుంది. తీసుకోగానే ప్రతిపక్షాలన్నీ ఏదో ఘోరం జరిగినట్లు గోల పెడుతున్నాయి. ‘మరి ఎన్నికల వేళ రద్దు చేస్తామని చెప్పారు కదా, యిప్పుడీ ప్రభుత్వనిర్ణయాన్ని సమర్థించవచ్చు కదా’ అంటే ‘తెరాస దురుద్దేశంతో చేస్తోంది’ అంటున్నాయి. ప్రజాసంఘాల వాళ్లు, పర్యావరణం వాళ్లు సరేసరి. ఈ ఒక్క చర్య వలననే వాతావరణమంతా కలుషితమై పోతోందని, లేకపోతే రాష్ట్రం మొత్తం సతతహరితంగా ఉండేదన్నట్లు మాట్లాడుతున్నారు.
కెసియార్ ఒక కమిటీ కూడా వేశారు. కానీ దాని ప్రయోజనం ఏమిటో తెలియలేదు. మామూలుగా అయితే కమిటీ వేసి, దాని సిఫార్సుల మేరకు కాబినెట్ లేదా అసెంబ్లీ నిర్ణయం తీసుకుంటుంది. ఈయన కాబినెట్లో నిర్ణయం తీసేసుకుని కమిటీ వేశాడు. వాళ్లు చేయాల్సిన పని ఏమిటి? భేష్ అనడమా? వీళ్లు భేష్ అన్నా, ఓస్ అన్నా పైన కోర్టులున్నాయి. ప్రజాహక్కుల సంఘాలన్నీ తమను ఇంప్లీడ్ చేయమంటాయి. పర్యావరణానికి హాని అనగానే న్యాయమూర్తులు గంగవెర్రులెత్తి పోతారు. ఠాఠ్ ఏ మార్పులూ వీల్లేదంటారు. అందువలన యిది అమలయ్యేవరకూ గ్యారంటీ లేదు. ఎమోషనల్‌గా కాకుండా రేషనల్‌గా ఆలోచించి, దాని వలన కలిగే లాభనష్టాలను అనేక కోణాల నుంచి పరిశీలించి, ఏది మంచిదో చూద్దాం.
టీవీ చర్చల్లో కొందరు ఆ ప్రాంతం హైదరాబాదు నగరానికి ఊపిరితిత్తుల వంటివి, అక్కడ వేలు పెడితే, నగరం ఊపిరాడక చచ్చిపోతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరడుగుల మనిషికే రెండు ఊపిరితిత్తులున్నాయి. ఇంత పెద్ద నగరానికి ఎన్ని లంగ్స్ ఉండాలి? నగరానికి ఓ మూల ఉంటే సరిపోయిందా? ప్రతీ జనావాసం వద్ద, ప్రతీ పారిశ్రామిక వాడ వద్ద ఉండనక్కరలేదా? ఏదైనా కాలనీ కట్టినపుడు మధ్యలో పార్కుకని కొంత స్థలం వదిలేసి, అక్కడ మొక్కలు పెంచితే తప్ప పర్మిషన్లు యిచ్చేవారు కాదు. ఇప్పుడది పోయింది. అడ్డదిడ్డంగా పది సందులు ఏర్పడితే చాలు, వాటికి స్థానిక నాయకుడి పేరు కలిపి కాలనీ అని పెడితే చాలు, పర్మిషన్లు వచ్చేస్తున్నాయి. పార్కు ఎక్కడ? అని అడగటం లేదు. పార్కులున్న కాలనీలు తగ్గిపోయాయి.
పాతకాలం కాలనీల్లో పెట్టిన పార్కులు సైతం అలాగే ఉండిపోలేదు. చాలా వాటిల్లో కొంత ఏరియాలో గుళ్లు కట్టేశారు. గుడి కట్టడం వలన హరితం పెరగదు, జనసమ్మర్దం పెరుగుతుంది. పార్కులో క్రీడాస్థలం, వాకింగ్ ఏరియా తగ్గుతుంది. గుడికి పేరు వచ్చిందంటే, పక్క ఏరియాల నుంచి కూడా జనాలు ఉత్సవాలకు పోటెత్తుతారు. ఈ ప్లే ఏరియాను కొన్ని రోజుల పాటు మూసేస్తారు. చెట్లు కొట్టించేస్తారు. పర్యావరణం ఏమైనట్లు? హైదరాబాదు వంటి నగరంలో అక్రమ కట్టడాలు లక్షల సంఖ్యల్లో ఉంటాయి. గతంలో అయితే ‘వలసవాదులే వీటన్నిటికీ పర్మిషన్లు యిచ్చి, నగరాన్ని చెడగొట్టారు’ అని టి ఉద్యమకారులు గగ్గోలు పెట్టేవారు. ఇప్పుడు గత 8 ఏళ్లలో అక్రమ కట్టడాలు పెరిగాయి తప్ప తగ్గలేదు. వర్షాకాలం వస్తే కబ్జా చేసిన చెఱువుల, కాలువల విషయం, నీటివాలుకి అడ్డంగా కట్టేసిన బిల్డింగుల వివరాలు పేపర్లలో వస్తాయి. అధికారులపై మంత్రులు కన్నెర్ర చేస్తారు. బిల్డింగులు కూల్చేస్తామంటారు. వర్షం ఆగగానే ఏమీ చేయరు.
ఇక పాత బస్తీలైతే యిరుకు సందులతో, పాత యిళ్లను పడగొట్టి కట్టేసిన కొత్త కాంప్లెక్సులతో నిండి వుంటాయి. ఒకప్పుడు పదిమంది ఉండే ఒక ఇండిపెండెంట్ యిల్లు స్థానంలో యిప్పుడు 150-200 మంది ఉండే 40 ఫ్లాట్లు వచ్చేశాయి. పార్కింగుకి చోటుండదు. విజిటర్స్ రోడ్ల మీద పార్క్ చేసుకోవాలి. డ్రైనేజి వ్యవస్థపై ఎంతో భారం. మంచి నీటి వసతిపై కూడా! సిటీపై ఒత్తిడి పెంచుకుంటూ పోయే బదులు, సిటీని ఆనుకుని దానికి దాదాపు రెట్టింపు (హైదరాబాదు జిల్లా ఏరియా 217 చ.కి.మీ.లైతే, 111 అమల్లో ఉన్న 84 గ్రామాల్లో ఉన్న ఏరియా 538 చ.కి.మీ.లట!!) ఏరియా లభ్యమౌతూ ఉంటే దాన్ని వదులుకోవడం పర్యావరణానికి మేలు చేసినట్లా? సిటీ జనం అక్కడ కట్టబోయే శాటిలైట్ టౌన్స్‌కు షిఫ్ట్ అయినా, కనీసం కొత్తగా వచ్చే జనం అక్కడ స్థిరపడినా, సిటీపై భారం పడడం ఆగుతుంది కదా!
ముంబయి యిదివరకు కృంగిపోతూ ఉండేది. నవీ ముంబయి కట్టి జనాల్ని అక్కడకు మళ్లించారు. రెండిటికీ పోలికే ఉండదు. కొత్త ఏరియా కాబట్టి విశాలంగా కట్టారు. అన్ని సదుపాయాలూ ఉన్నాయి. ఎటొచ్చీ విటి స్టేషన్లో దిగితే దూరం ప్రయాణం చేయాలి. హైదరాబాదు విషయంలో అయితే రెండిటినీ కలపడానికి విశాలమైన ఒఆర్ఆర్ సిద్ధంగా ఉంది. మరిన్ని కట్టవచ్చు. దీనివలన సిటీలోనే యిళ్లు కొనుక్కోవలసిన అవసరం లేదు. నిజానికి రూ.30-40 లక్షల మధ్యలో ఓ డీసెంటు ఏరియాలో టూ బెడ్ రెమ్ ఫ్లాట్ ఉండడమనేది, మధ్యతరగతి జీవుల కల. హైదరాబాదులో ప్రస్తుత పరిస్థితుల్లో అలాటి కల కనడం కూడా భయంగా తోస్తోంది. రానురాను పరిస్థితి మరీ భీకరమై హైదరాబాదులో ఉండే కంటె దగ్గర పల్లెటూళ్లలో ఉండి అప్ అండ్ డౌన్ చేయడం మంచిదనుకోవచ్చు.
బొంబాయిలో కాపురం పెట్టలేక, పూనాలో పెట్టి, రోజూ అప్ అండ్ డౌన్ చేస్తూ వారానికి ఓ సారి మాత్రమే కుటుంబంతో గడిపేవారు. హైదరాబాదు అలా తయారవడం కంటె నగరం చుట్టూ శాటిలైట్ టౌన్స్ వచ్చి, అందుబాటు ధరల్లో ఫ్లాట్లు దొరికితే, మెట్రో లైన్లు, ఎంఎంటిఎస్ లైన్లు వేస్తే నగరం బాగుపడుతుంది. కొత్తగా కట్టే శాటిలైట్ టౌన్స్ కాబట్టి, పర్యావరణానికి సంబంధించిన నిబంధనలన్నీ గట్టిగా పాటించవచ్చు. విశాలమైన రోడ్లతో, రోడ్ల మధ్య చెట్లతో కాలనీలు ఏర్పాటు చేయవచ్చు. ప్రతీ కాంప్లెక్స్‌కు సోలార్ ఎనర్జీ ఉండాలని, సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలని, చెట్లు పెంచాలని యిలా సవాలక్ష నిబంధనలు పెట్టి, గ్రౌండ్ వాటర్ తరిగిపోకుండా చూడవచ్చు. అవి చక్కగా తయారైతే జనాలు అటువైపు వెళ్లడం మొదలెడితే హైదరాబాదులో రియల్ ఎస్టేటు ధరలు నిలకడగా వుంటాయి.
ఇవన్నీ ప్రస్తుత నగరంలోనే చేయవచ్చని ఎవరైనా వాదిస్తే వాళ్లకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియవని అనుకోవాలి. రోడ్డు వెడల్పు చేద్దామంటే ఒక పాత యిల్లు అడ్డు వస్తుంది. వాడు కోర్టుకి వెళ్లి స్టే తెస్తాడు. ప్రభుత్వం భారీ కాంపెన్సేషన్ యిచ్చి కేసు విత్‌డ్రా చేయిద్దామంటే పదిమంది వారసులు పుట్టుకొచ్చి, ఏదీ తేల్చరు. ఇక ప్రార్థనాస్థలాలు ఒక పెద్ద బెడద. 22 ఏళ్ల క్రితం మోతీ నగర్లో ఒక ఫ్లాట్ కొన్నాను. ఎజి కాలనీ నుంచి వెడల్పయిన రోడ్డు వుంది కానీ అది హఠాత్తుగా మధ్యలో చిక్కిపోయి బస్సు వచ్చేది కాదు. దాంతో అది హైవే కాలేకపోయింది. రోడ్డు చిక్కిన కారణమేమిటంటే దానికి ఓ వైపు గుడి, మరో వైపు మసీదు ఉన్నాయి. వాటి ధీమా చూసుకుని, మధ్యలో ఉన్న యిళ్లవాళ్లు పాతుకుపోయారు. ఫ్లాట్ కొనేటప్పుడు మా బిల్డర్ ‘కోర్టులో కేసు ఏడాదిలో తెమిలిపోతుంది గుడి, మసీదు అంటుకోకుండా ఎస్ ఆకారంలో రోడ్డు పడుతుంది’ అని హామీ యిచ్చాడు. 22 ఏళ్లగా అదేమీ జరగలేదు. విసుగెత్తి పదేళ్ల క్రితం ఆ ఫ్లాట్ అమ్మేశాను కూడా!
గుళ్లే కాదు, రోడ్ల విస్తరణకు శ్మశానాలు సైతం అడ్డు వస్తాయి. పంజగుట్ట, అమీర్‌పేటల మధ్య శ్రీనగర్ కాలనీ టి జంక్షన్ వద్ద శ్మశానం చూడండి, బంజారా హిల్స్ చెట్నీస్ ఎదురుగా శ్మశానం చూడండి. వాటివలన ఎంత ట్రాఫిక్ జామ్! భూమిలో శవాల ఆనవాళ్లు కూడా మిగిలివుండవు. సమాధి దగ్గర మట్టిని ఓ పాత్రలోకి తీసి, వాళ్ల వారసుల చేతిలో పెట్టి, ఎక్కడ భద్రపరుస్తారో అక్కడ భద్రపరుచుకోండి అని చేతికిచ్చేసి, స్మశానాన్ని చదును చేసేసి, రోడ్డు విస్తరిస్తే బాగుంటుంది. కానీ ఎవరూ దీన్ని చేయరు. నేషనల్ హైవేలలో కూడా ఏమీ చేయరు. ఇలా నగరం గురించి చెప్పుకుంటూ పోతే ఏడుపొస్తుంది. అదే కొత్తగా వచ్చే శాటిలైట్ టౌన్స్ అయితే కొత్త పలక మీద రాసినట్లు, నీట్‌గా ప్లాను చేయవచ్చు.
ఇవన్నీ లాభాల గురించి రాసినవి. ఇక నష్టాల గురించి మాట్లాడాలంటే ‘ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కలుషితమై పోతాయి. వాటికి నీటి సరఫరా తగ్గిపోతుంది. అవి జంటనగరాలకు అందించే నీటివసతికి విఘాతం కలుగుతుంది’ అని మాట్లాడతారు. ఈ వాదనలు గతంలో అయితే చెల్లుతాయి. జంటనగరాలు నీటి సరఫరాకై వాటిపై ఆధారపడటం మానేశాయని ప్రభుత్వం సమర్థవంతమైన వాదన వినిపించింది. అయినా విశాలమైన ఆ చెరువులు అలా ఉండాల్సిందే. వర్షం వచ్చినపుడు నిండాల్సిందే. దాని గురించి నీటివాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ నిర్మాణాలు రాకుండా నిషేధించాలి. 111 జీవో తెచ్చినప్పుడే యీ పని చేసి వుంటే యిన్ని చిక్కులు వచ్చేవి కావు. కానీ మనవాళ్లు కంట్లో నలక తీయమంటే కంటికి ప్యాచ్ కట్టేసే రకం.
స్వానుభవం ఒకటి చెప్తాను. ఓ స్థలం కొన్నాను. అమ్ముదామని చూస్తే చిక్కు వచ్చింది. ఆ చుట్టుపట్ల భూములున్న ఒక కుటుంబంలో అందరూ కలిసి, మరొకరికి భూమి అమ్మారు. అమ్మిన తర్వాత రేట్లు పెరిగాయి. వీళ్లకు దురాశ పుట్టింది. కుటుంబంలో ఆడవాళ్ల చేత ‘మమ్మల్ని సంప్రదించలేదు, మా సంతకాలు ఫోర్జ్ చేశారు’ అంటూ కేసు పడేయించారు. కోర్టు దాన్ని విచారణకు తీసుకుంది. ఆ భూమి మూడు సర్వే నెంబర్లలో విస్తరించి ఉంది. న్యాయమూర్తి ఆ మూడు సర్వే నెంబర్లలో ఉన్న భూములన్నిటి క్రయవిక్రయాలపై స్టే విధించాడు! వీళ్ల భూమి మేరకు స్టే విధిస్తే సరిపోయేదానికి, సర్వేలో ఉన్న తక్కిన భూములకు కూడా స్టే వర్తింపచేయడం దేనికి? ఈ కారణం చేత నేను భూమిని అమ్మలేకపోయాను. ఇప్పుడీ చెఱువులే ఉన్నాయి. వాటికి గ్రామాల్లోంచి వర్షపు నీరు వచ్చి చేరుతోంది, దానికి అడ్డు రాకూడదు అనుకుంటే, ఆ దారులు గుర్తించి, ఆ ప్రాంతంలో మాత్రం నిర్మాణాలు జరగకూడదు అని నిషేధిస్తే పోయేది. దానికి బదులుగా, గ్రామం గ్రామం మొత్తాన్ని నిషేధించేస్తే ఎలా? అదీ 84 గ్రామాలు!
ఇక జలాశయాలు కలుషితం కాకుండా చూడడమనేది, మన ప్రాథమిక కర్తవ్యం. 111 ఎత్తేస్తే హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్లా అయిపోతుంది అంటున్నారు. హుస్సేన్ సాగర్ ఎందుకిలా అయింది? ఊరి డ్రైనేజిని, ఫ్యాక్టరీలు వ్యర్థాలను దానిలోకి వదిలేయడం వలన! ఎందుకు అనుమతించారు? ఇప్పటికీ అనుమతిస్తున్నారు కదా! కెసియార్ అధికారంలోకి రాగానే హుస్సేన్ సాగర్ గురించి ఏం చెప్పారు? ఏం చేశారు? ఈ సాగర్లు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఏ జలాశయాన్ని కలుషితం చేసినా శిక్షించాలి. ఇలా ప్రాక్టికల్‌గా రూల్స్ ఫ్రేమ్ చేస్తూ పోతే 111 ఎత్తేసి 84 జిల్లాలను వాడుకలోకి తేవడాన్ని అభ్యంతర పెట్టడానికి లేదు. అబ్బే, పోనీ కదాని ఒకటి అనుమతిస్తే, అన్నీ ఉల్లంఘించేస్తారు అని కొందరి వాదన. పోనీ ఎత్తేయలేదయ్యా, అంతా సవ్యంగా నడుస్తోందా? ఆ 84 గ్రామాల్లో ఓ పక్క మధ్యతరగతి వాడు బోరు వేయాలన్నా అధికారులు పర్మిషన్ యివ్వరు. మరో పక్క మోతుబర్లు రాజకీయ మద్దతుతో కాలేజీలు, యూనిర్శిటీలు కట్టేస్తూ ఉంటే గుడ్లప్పగించి చూస్తున్నారు.
జీఓ వచ్చాక మూడు పార్టీల ప్రభుత్వాలు వచ్చాయి. ఉల్లంఘనలు నిరాఘంటంగా సాగిపోతూ వచ్చాయి. ఏం చేశాయి ఆ పార్టీలు? ఇప్పుడు జీఓ ఎత్తివేతకు అభ్యంతరాలు చెప్తున్న పార్టీలు ఆ కాలేజీల ముందు నిరాహారదీక్షలు చేశాయా? వాటిని కూల్చివేయాలని కోర్టులకు వెళ్లాయా? నిక్కచ్చిగా చెప్పాలంటే యిన్నాళ్లూ ఉల్లంఘనల ద్వారా శ్రీమంతులు మాత్రమే లాభపడుతూ వచ్చారు. ఇది ఎత్తివేస్తే అన్ని తరగతుల వాళ్లకూ ప్రయోజనం కలుగుతుంది. మరి దీన్ని వ్యతిరేకించడం దేనికి? ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా యాక్టివైజ్ అయిపోతుంది. నివేశ్న స్థలం, వాణిజ్య స్థలం యిబ్బడిముబ్బడిగా అందుబాటులోకి వచ్చి, అక్కడి జనులు లబ్ధి పొందుతారు. వాళ్లంతా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారంటూ తెరాసకు జై అంటారు. ఇది తక్కిన పార్టీలకు యిష్టం లేదు.
అంతేకాదు, జీవో పరిధిలో ఉన్న 18,332 ఎకరాల ప్రభుత్వ భూమి, 9235 ఎకరాల అసైన్డ్ భూమి, 2080 ఎకరాల వ్యవసాయ సీలింగు భూమి, 1256 ఎకరాల భూదాన్ భూములు యివన్నీ ప్రభుత్వానికి అందివస్తాయి. ప్రభుత్వం వాటిని వేలం వేసో, సంస్థలకు కేటాయించో డబ్బు గడిస్తుంది. ఎయిర్‌పోర్టు ఉన్న శంషాబాద్ మండలంలోనే 5223 ఎకరాలున్నాయి. అవే చాలు, డబ్బు చేసుకోవడానికి! ప్రభుత్వం యిలా బెనిఫిట్ అయిపోతూ ఉంటే ప్రతిపక్షాలకు మండదా? ఆ ఎత్తివేతేదో తమ హయాంలో జరిగి, ఆ క్రెడిట్, ఆ ఫండ్సూ తమకే రావాలి తప్ప, తెరాసకు వస్తే ఎలా అని దుగ్ధ. కోర్టులకు వెళ్లి ఆపించినా ఆశ్చర్యపడవద్దు.
వీళ్లంతా ఒకటే పాఠం వల్లిస్తున్నారు, హైదరాబాదుకు నీటివసతి కల్పించే వాటి జోలికి వెళ్లకూడదు. ఆ జీఓ విధించినప్పుడు ఉన్న స్ఫూర్తి చెడిపోకూడదు అని. హైదరాబాదు నీటికై వాటిపై ఆధారపడటం లేదని కెసియార్ చెప్తున్నారు. కాదూ, పడుతోంది, ఫలానా యిన్ని గేలన్లు తీసుకుంటోందని వాటర్ బోర్డు చెపుతోంది అని వీళ్లు అంకెలు చెప్పాలిగా! ఇక స్ఫూర్తి గురించి నాకు ‘తద్దినం పిల్లి’ కథ గుర్తుకు వస్తోంది. ఒకళ్లింట్లో పిల్లిని పెంచుకునేవారట. తద్దినం రోజు అది వచ్చి పిండాల్ని ముట్టేసు కుంటుందేమోనని ఒక రోలుకి దాన్ని తాడు పెట్టి కట్టేసేవారట. ఆ యింట్లో చిన్న పిల్లవాడు ఆ దృశ్యాన్ని చూస్తూ పెరిగాడు. అతను పెద్దవాడయ్యేసరికి పిల్లిని పెంచడం మానేశారు. కానీ యితని మనసులో అటు తద్దినం, యిటు రోలుకి కట్టేసిన పిల్లి దృశ్యం ముద్రించుకుని పోయింది. అందువలన యింట్లో తద్దినం వస్తే ఎవరింటి నుంచైనా పిల్లిని అరువు తెచ్చుకుని, రోలుకి కట్టేసి శ్రాద్ధకార్యక్రమం పూర్తి చేసేవాడట. ఈ రోజు మనం మూఢనమ్మకా లనుకునేవాటికి ఒరిజినల్‌గా సహేతుకమైన కారణమే వుండి వుంటుంది. కాలం మారడంతో హేతువు మారి, అది వ్యర్థాచారం అవుతుంది. కానీ వాటినే పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారు కొందరు. దీన్ని ఎందుకు చేస్తున్నాం అని తర్కించుకుని చూసుకుంటే యీ ప్రమాదాలు తప్పుతాయి.
కానీ యిలా తర్కించేవాళ్లు తక్కువ. గతంలో అలా వుంది, యిప్పుడూ అలాగే ఉండాలి అనే వాదిస్తారు. ముఖ్యంగా పర్యావరణం పేరుతో అభివృద్ధి అడ్డుకోవడం అతి యీజీ. ఓ పెద్ద హైడల్ పవర్ ప్రాజెక్టు కడుతున్నాం. వైర్లు ఓ అడవి గురించి వెళతాయి అంటే వైర్లు వేస్తే అక్కడ అరుదైన పక్షి జాతులకు హాని కలుగుతుంది, ప్రాజెక్టు ఆపేయాలి అని ఒకళ్లు కోర్టుకి వెళతారు. చాలు, పాతికేళ్లయినా ఆ కేసు తేలదు. ఎవరైనా జడ్జి, పోనీ ఆ మొక్కలేవో వేరే చోట వేయించి, ఆ పక్షులను అక్కడకు జాగ్రత్తగా బదిలీ చేయించి… అని సూచించబోతే, అదిగో ఆ ప్రాజెక్టులో వాటాలున్న విదేశీ సంస్థ నుంచి లంచం తీసుకుని అలా అంటున్నాడు అని పర్యావరణకారులు కారాలుమిరియాలూ నూరతారు. ప్రతి జీవికి సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. పక్షులు వేలమైళ్లు ఎగురుకుంటూ వెళ్లి అక్కడ గుడ్లు పెట్టి వస్తూంటాయి. అలాగే యివీ వెళ్లవచ్చు. ఆ విద్యుత్ వలన లక్షలాది మనుష్యులకు మేలు కలుగుతుంది అనే అంశాన్ని లెక్కలోకి తీసుకోకుండా వీళ్లు వాదిస్తారు. అందువలన 111 జీఓ రద్దు, కోర్టు గడప దాటేదాకా నాకు నమ్మకం లేదు. ముఖ్యంగా బిజెపి ప్రతిఘటిస్తోంది కాబట్టి చాలా అడ్డంకులు రావచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2022)