అల వైకుంఠపురంలో తరువాత త్రివిక్రమ్ సినిమా….చాలా కాలం తరువాత మహేష్-త్రివిక్రమ్ ల కాంబినేషన్…దాంతో ఇంకా ప్రారంభం కాని ఈ సినిమాకు డిమాండ్ బాగానే కనిపిస్తోంది. అది చూసి యూనిట్ కూడా రేట్లు గట్టిగానే కోట్ చేస్తోంది. టోటల్ ఓవర్ సీస్ రైట్స్ కోసం 25 కోట్లు కోట్ చేస్తోందంట నిర్మాణ సంస్థ అయిన హారిక హాసిని.
ఈ 25 కోట్లలో మేజర్ షేర్ యూఎస్ దే వుంటుంది. తరువాత ఆస్ట్రేలియా, దుబాయ్ వగైరా…కానీ పాతిక కోట్లు అంటే అమ్మో…అన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓవర్ సీస్ టోటల్ లో సింగిల్ హోల్ సేల్ ప్లేయర్ గా వున్న సంస్థ 20 కోట్ల వరకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తం థియేటర్ మీద 130 నుంచి 140 వరకు రాబట్టాలన్నది హారిక హాసిని ప్లాన్. ఆంధ్ర 40, నైజాం 40, సీడెడ్ 15, ఓవర్ సీస్ 25, కర్ణాటక, ఇతర ప్రాంతాలు ఇలా అన్నీ కలిపి 130 నుంచి 140 కోట్లు రాబట్టాలని లెక్కలు కడుతున్నారు.
ఒక్క అడియో రైట్స్ నే ఈసారి 15 నుంచి 20 కోట్లకు కోట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాల ను పక్కన పెడితే ఇది చాలా పెద్ద మొత్తం. హిందీ రైట్స్ కింద 30, డిజిటల్..శాటిలైట్ కింద 50 ఇలా పెద్ద పెద్ద అంకెలు పలుకుతున్నారు.
చూస్తుంటే 250 కోట్ల రేంజ్ లో మార్కెట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతకీ ఇందులో మహేష్ వాటా ఎంతో? త్రివిక్రమ్ రెమ్యూనిరేషన్ ఎంతో?