టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పరుష వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు తీవ్రంగా స్పందించారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అయిన అచ్చెన్నాయుడు తొడకొడితే ఏమవుతుందో చెప్పి హెచ్చరించడం గమనార్హం. ఇంకోసారి అవాకులు చెవాకులు పేలితే పద్ధతిగా వుండదని హెచ్చరించారు.
వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో సంబరాల అనంతరం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడిని నడిరోడ్డుపై గుడ్డలూడదీసి అంకుశం సినిమాలో మాదిరిగా కొడతానని తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. మంతెన ఏమన్నారో ఆయన మాటల్లోనే….
“రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీ నాయకులు మతిభ్రమించి, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు మీద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం. టెక్కలి రోడ్డు మీద గుడ్డలూడదీసి కొడ్తానని వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, శాసనసభ్యుడైన ఆ విధంగా మాట్లాడ్డం, మీ నాయకుడు దాన్ని ఖండించకపోవడం అత్యంత బాధాకరం. రౌడీషీటర్‌ని చట్టసభలకి పంపిస్తే ఇలాగే వుంటుంది. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలి.
అచ్చెన్నాయుడి గుడ్డలు ఊడదీయడం కాదు… టెక్కలి, శ్రీకాకుళం ప్రజలు నాకు తెలిసి నాలుగైదు సార్లు నిన్ను ప్రజాక్షేత్రంలో గుడ్డలూడదీసి నడిరోడ్డు మీద నిలబెట్టారు. నువ్వు సిగ్గుపడాలి. సిగ్గుపడాల్సింది పోయి ఈ విధంగా మూర్ఖుడిలా, పిచ్చోడిలాగా వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అచ్చెన్నాయుడి కటౌట్ ఎప్పుడైనా చూశావా? అచ్చెన్నా యుడి ఎదురుగా నువ్వు నిలబడాలంటే నాలుగడుగుల స్టూల్ వేసుకోవాలి.
అచ్చెన్నాయుడు తొడకొడితే ఆ సౌండ్‌కే గుండె ఆగి చస్తావు. ఎందుకు నీకు అలాంటి మాటలు. పోనీ నీకు అంత సరదాగా వుంటే… డేట్, టైమ్, ప్లేస్ నువ్వు చెప్పు. శాసనమండలి సభ్యున్ని కాబట్టి నేను వస్తా. నీకు అచ్చెన్నాయుడు అవసరం లేదు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. ఇంకోసారి ఈ విధంగా మాట్లాడితే పద్ధతిగా వుండదు” అని హెచ్చరించడం గమనార్హం.