అలర్ట్ పోలీస్: రిలాక్స్ అయితే పప్పులో కాలేసినట్టే!

సెప్టెంబరు ఒకటో తేదీన ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించాలని, చలో విజయవాడ కార్యక్రమాన్ని భారీస్థాయిలో నిర్వహించాలని పిలుపు ఇచ్చిన సీపీఎస్ రద్దుకోరుతున్న ఉద్యోగ సంఘాలు ఆ కార్యక్రమాలను విరమించుకుంటున్నట్టుగా ప్రకటించాయి.  Advertisement సెప్టెంబరు 1న కాకుండా,…

సెప్టెంబరు ఒకటో తేదీన ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించాలని, చలో విజయవాడ కార్యక్రమాన్ని భారీస్థాయిలో నిర్వహించాలని పిలుపు ఇచ్చిన సీపీఎస్ రద్దుకోరుతున్న ఉద్యోగ సంఘాలు ఆ కార్యక్రమాలను విరమించుకుంటున్నట్టుగా ప్రకటించాయి. 

సెప్టెంబరు 1న కాకుండా, తమ శాంతియుత నిరసనలను సెప్టెంబరు 11న నిర్వహించాలని నిర్ణయించినట్టు సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ప్రకటించారు. సెప్టెంబరు 1న ఉద్యోగులు ఎవ్వరూ విజయవాడకు రావొద్దని పిలుపు ఇచ్చారు. పోలీసులు పెద్దఎత్తున ఆంక్షలు విధించి,అరెస్టులు చేస్తున్న నేపథ్యంలోనే ఈ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. 

అయితే పోలీసు యంత్రాంగం మాత్రం.. ఈ ప్రకటనలను సీరియస్‌గా పరిగణించడంలేదు. పోలీసుల ఆంక్షలు గట్టిగా పనిచేస్తుండడం, నియంత్రిస్తుండడం, విజయవాడ నగరం మొత్తం పోలీసు నిఘాలో ఉండడం వంటి కారణాల నేపథ్యంలో ఉద్యోగులు వెనుకంజ వేసినట్టుగా వారి ప్రకటన ఉంది. అయితే అది వెనుకంజ వేయడమేనా? లేదా, వ్యూహం మార్చి, పోలీసులు రిలాక్స్ అయితే ఒక్కసారిగా ఉద్యమంతో విరుచుకుపడాలని చూస్తున్నారా? అనే సందేహం పోలీసుల్లో ఉంది. 

చలో విజయవాడ విరమించుకుంటున్నట్టుగా ఒక ప్రకటన ద్వారా.. పోలీసుల దృష్టి మరల్చి సరిగ్గా ఒకటో తేదీనాటికి నగరాన్ని ముట్టడిస్తే గనుక మొత్తం ప్రభుత్వం పరువు పోతుందనేది వారి భయం. 

విజయవాడకు వెళ్లి నిరసన తెలియజేయాలనే ఉద్యమపిలుపు.. సీపీఎస్ కేటగిరీలోని ఉద్యోగులందరికీ చేరిపోయింది. అలాంటిది ఇప్పుడు ఇద్దరు నాయకులు విరమిస్తున్నట్లు ప్రకటించినంత మాత్రాన.. ఉద్యోగులంతా వారి మాటకు జైకొట్టాలనే రూలేం లేదు. పీఆర్సీ విషయంలో ఉద్యోగసంఘాల నాయకులు పిలుపు ఇచ్చిన తర్వాత కూడా వారిని బేఖాతరు చేస్తూ ఎన్ని నిరసనలు వెల్లువెత్తాయో అందరికీ తెలుసు. అదే తరహాలో సీపీఎస్ ఉద్యోగుల విషయంలో కూడా ఈ నాయకుల విరమణ ప్రకటనను బేఖాతరుచేసి… ముట్టడించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. పోలీసులు ఈ అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 

ఆంక్షలు కఠినంగా విధిస్తున్నాం కదా అని, కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యల పట్ల ఉద్యోగులు బెదిరిపోయి వెనక్కి తగ్గారని అనుకోకుండా.. పోలీసులు జాగ్రత్తపడితేనే ప్రభుత్వం పరువు పోకుండా ఉంటుంది.