ఆశ్చ‌ర్య‌ప‌రిచిన హైకోర్టు ప్ర‌శ్న‌!

అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబితే…హైకోర్టు చేసిన కీల‌క వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల విచార‌ణ‌లో భాగంగా హైకోర్టు అడిగిన ప్ర‌శ్న‌కు ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది స‌మాధానం మ‌రోసారి రాజ‌ధాని అంశాన్ని తెర‌పైకి…

అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబితే…హైకోర్టు చేసిన కీల‌క వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల విచార‌ణ‌లో భాగంగా హైకోర్టు అడిగిన ప్ర‌శ్న‌కు ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది స‌మాధానం మ‌రోసారి రాజ‌ధాని అంశాన్ని తెర‌పైకి తెచ్చాయి.

న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం కింద రాజ‌ధాని ప్రాంతంలో ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కోసం 2020, ఫిబ్ర‌వ‌రి 25న రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో నంబ‌ర్ 107 తీసుకొచ్చింది. 50 వేల మందికి ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే రాజ‌ధానికి ఇచ్చిన భూముల్లో పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వాల‌ని అనుకోవ‌డం సీఆర్‌డీఏ చ‌ట్ట నిబంధ‌న‌ల‌కు విరుద్ధ మంటూ 107 జీవోను స‌వాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖ‌లు చేశారు. ఈ జీవోపై ఇప్ప‌టికే మ‌ధ్యంత‌ర స్టే ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి (సీజే) జ‌స్టిస్ ప్ర‌శాంత్‌కుమార్ మిశ్రా, న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ డీవీఎస్ఎస్ సోమ‌యాజులు, జ‌స్టిస్ చీక‌టి మాన‌వేంద్ర‌నాథ్ రాయ్‌ల‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా  పిటిష‌న‌ర్ల త‌ర‌పు న్యాయ‌వాది ఇంద్ర‌నీల్‌బాబు వాద‌న‌లు వినిపించేందుకు సిద్ధం అవుతుండ‌గా ధ‌ర్మాస‌నం జోక్యం చేసుకుంటూ… రాజ‌ధానిపై కొంద‌రు రైతులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించినందున విచార‌ణ‌ను అక్టోబ‌ర్ 21కి వాయిదా వేస్తున్న‌ట్టు తెలిపింది.

ప్ర‌భుత్వ అద‌న‌పు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ (ఏఏజీ) పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి వాద‌న‌లు వినిపిస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల వ‌ల్ల 50 వేల మందికి ఇళ్ల ప‌ట్టాల మంజూరు ఆగిపోయింద‌ని ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లారు. కావున విచార‌ణ‌ను రెండు వారాల‌కు వాయిదా వేయాల‌ని అభ్య‌ర్థించారు. ఈ సంద‌ర్భంగా త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం కీల‌క ప్ర‌శ్న సంధించింది.

రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే నిర్మిస్తున్నారా? అని ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాదిని ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. ఔన‌ని స‌మాధానం ఇస్తే మీరు కోరిన విధంగానే విచార‌ణ చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ప్ర‌భుత్వ న్యాయ‌వాది ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. రాజ‌ధాని వ్య‌వ‌హారం త‌న ప‌రిధిలోనిది కాదంటూ నిస్స‌హాయ‌త వ్య‌క్తం చేశారు. రాజ‌ధానిని మార్చే హ‌క్కు ఏపీ చ‌ట్ట‌స‌భ‌కు లేద‌ని గ‌తంలో ఇదే హైకోర్టు తీర్పు తేల్చి చెప్పింది. ఈ నేప‌థ్యంలో రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే నిర్మిస్తే విచార‌ణ‌ను వెంట‌నే చేప‌డ‌తామ‌ని చెప్ప‌డం విశేషం.