టీడీపీకి సుగ్గశరం ఉండదా? ఒకవైపు బీజేపీ నేతలు… థూ యాక్, మీ వాసనే వద్దని ఛీత్కరించుకుంటున్నారు. మీతో పొత్తు వద్దే వద్దని తేల్చి చెబుతున్నారు. వారసత్వ పార్టీలతో పొత్తేంటని బీజేపీ నేతలు నేరుగానే టీడీపీ, వైసీపీలను విమర్శిస్తున్నారు. ఇన్ని రకాలుగా ఆడిపోసుకుంటున్నా… ఇంకా లోకేశ్‌తో అమిత్‌షా మాట్లాడారని, చంద్రబాబుతో మోదీ గుసగుసలాడారని, ఇక పొత్తులే తరువాయని ఎల్లో మీడియా ఊదరగొడుతోంది.
అదేమంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే వాదనను తెరపైకి తెస్తారు. ఇది నిజం కావచ్చు. కానీ అటు వైపు సానుకూల సంకేతాలు వెలువడితే, ఇటు వైపు నుంచి ఎన్ని విద్యలైనా పడొచ్చు. ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. మరి ఏ మొహం పెట్టుకుని బీజేపీతో పొత్తు వుంటుందని టీడీపీ ప్రచారం చేసుకుంటున్నదో అర్థం కాదు.
తాజాగా బీజేపీ జాతీయ నాయకులు జీవీఎల్ నరసింహారావు, సునీల్ దేవధర్ ఏపీ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? బీజేపీతో పొత్తు లేకుంటే తమకు భవిష్యత్తు లేదని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర కామెంట్ చేశారు. పొత్తులపై మీడియాకు, కొన్ని పార్టీలకు గందరగోళం ఉందేమో గానీ తమ పార్టీకి మాత్రం స్పష్టత ఉందని టీడీపీ, ఎల్లో మీడియా వైఖరిని దృష్టిలో పెట్టుకుని ఘాటైన కౌంటర్ ఇచ్చారు.
బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి, జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ స్పందిస్తూ… ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ వారసత్వం ఉండే రాజకీయ పార్టీలతో తమ పార్టీ కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్డీఏలో టీడీపీ చేరుతుందని, రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వుంటుందని ప్రచారం చేసుకుంటున్న టీడీపీ చెంప చెళ్లుమనేలా ఆయన సమాధానం ఇచ్చారు. జనసేనతో మాత్రమే తమకు పొత్తు ఉందని ఆయన తేల్చి చెప్పారు. టీడీపీ, వైసీపీలకు సమానదూరంలో ఉంటున్నామన్నారు.
ఇన్ని రకాలుగా ఛీత్కరించుకుంటున్నా బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడే వాళ్లను ఏమనాలి? రాజకీయాల్లో వ్యూహాలే పార్టీలను ముందుకు నడిపిస్తాయి. కానీ దూరంగా వెళ్లిపోవాలని, మీ నీడ కూడా తమపై పడొద్దని చెబుతున్న బీజేపీతో పొత్తు కావాలని కోరుకోవడం అంటే ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడమే. అలాంటిదేమీ లేదని ఎవరైనా భావిస్తే… ఇక చెప్పేదేముంటుంది?