తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీఆర్ఎస్ నేతల ధిక్కార స్వరం పెరుగుతోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్‌ను వీడడమే తరువాయి అనే లెవెల్‌లో ఏకంగా కేసీఆర్‌నే టార్గెట్ చేయడం గమనార్హం. కొంత కాలంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ మార్పుపై విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన గన్‌మెన్లను కుదించిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమైనట్టు ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో ఇవాళ ఖమ్మం జిల్లా పినకపాకలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వెళుతున్నారనే సంకేతాల్ని ఆయన ఇచ్చారు. సమ్మేళన బ్యానర్‌పై ఎక్కడా బీఆర్ఎస్ పేరు లేదు. అలాగే సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ఫొటోలు, పేర్లు లేకపోవడం గమనార్హం. కేవలం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫొటోలు మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాదు, జై శ్రీనన్నా, జైజై శ్రీనన్నా అనే నినాదాలు బ్యానర్‌పై కనిపించాయి.
ఆత్మీయ సమ్మేళనంలో శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ను విమర్శించారు. భయపడితే ఒక రోజు, రెండురోజులు భయపడతామన్నారు. ప్రేమ అనేది రెండు వైపులా ఉంటేనే దానికి ఒక అర్థం వుంటుందన్నారు. నాలుగేళ్లుగా తండ్రీకొడుకుల బంధంగా నడిస్తే తనకు ఏం ప్రేమ, గౌరవం దక్కాయని ఆయన ప్రశ్నించారు. అధికారం వుందని అసెంబ్లీని సామ్రాజ్యంగా చేసుకుని దోచుకుంటున్నారని తండ్రీకొడుకుల్ని ఘాటుగా విమర్శించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాను కాంట్రాక్టర్‌నని.. బిల్లులు రాకుండా ఇబ్బందిపెట్టినా ప్రజల నుంచి వేరు చేయలేరని తేల్చి చెప్పారు.
మనిషిగా పుట్టిన తర్వాత కష్టనష్టాలు, సుఖదుఃఖాలు వుంటాయని తనకు తెలుసన్నారు. బిల్లులు ఆపినంత మాత్రాన తాను వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఖమ్మం ప్రజలే తప్ప తనకెవరూ రాజకీయాల్లో గాడ్ ఫాదర్స్ లేరని ఆయన అన్నారు. కొందరు చేస్తున్న పనులకు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పొంగులేటి హెచ్చరించారు. త్వరలో బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పొంగులేటి బీఆర్ఎస్‌పై ధిక్కార స్వరం వినిపించడం గమనార్హం.