తల్లి-బిడ్డ ఈ బంధానికి నిర్వచనం, కొలమానం లేనే లేవు. తల్లి ప్రేమకు అంతులేదు. పేగు బంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి బంధం ఎంత గొప్పదో చెప్పే సంఘటనలు అప్పుడప్పుడూ మన కళ్లముందే జరుగుతుంటాయి. అలాంటి ఓ ఘటనే తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో జరిగింది. కన్నబిడ్డ కన్నుమూశాడని తెలిసిన మరుక్షణం ఆ తల్లి గుండె ఆగింది. ఆ బిడ్డను కని, సాకి, పెద్దవాడిని చేసి, ప్రయోజకుడ్ని చేసిన తర్వాత దూరమయ్యాడా అంటే అదీ లేదు. కేవలం వారి మధ్య ఉన్న అనుబంధం 9 నెలలు.
కన్నతల్లి మమకారం..
ఆమె పేరు శోభ. వయసు 26 ఏళ్లు. కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి మండలం గూడెం గ్రామ నివాసి. తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టి చనిపోయింది. రెండోకాన్పు విషయంలో మరింత జాగ్రత్తగా ఉంది. కాన్పు సమయంలో 108లో ఆస్పత్రికి బయలుదేరగా.. ముందుగానే నొప్పులు రావడంతో అదే వాహనంలో ప్రసవం అయింది. మగబిడ్డ పుట్టాడు. ఆ తర్వాత మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి ఆమెను తరలించారు.
ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కావడంతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి వెంటనే చిన్న పిల్లల వైద్యశాలకు తరలించారు. అక్కడ బిడ్డ, ఇక్కడ తల్లి ఇద్దరికీ సీరియస్ గానే ఉంది. కొన్ని గంటల తర్వాత బిడ్డ చనిపోయాడనే వార్త తెలిసింది. పుట్టిన బిడ్డను కళ్లారా చూసుకునే భాగ్యానికి కూడా నోచుకోలేదని ఆ తల్లి హృదయం తల్లడిల్లింది, బిడ్డలేని లోకంలో తాను కూడా ఉండకూడదని అనుకుందో ఏమో ఆ గుండె ఆగింది. బిడ్డపై తల్లికి ఉన్న ప్రేమకు నిర్వచనం ఈ సంఘటన.
ఇది యమపాశం..
బిడ్డ ప్రాణం పోయిన వెంటనే తల్లడిల్లి ప్రాణాలు కోల్పోయిన తల్లి ఉదంతం ఓవైపు. కన్నబిడ్డను కర్కశంగా మట్టుబెట్టిన మరో కఠినాత్మురాలు ఇంకోవైపు. పెళ్లి కాకుండానే తల్లయిన ఓ యువతి, అప్పుడే పుట్టిన పసికందును అపార్ట్ మెంట్ మూడో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది. తల పగిలి తీవ్ర గాయాలతో ఆ బిడ్డ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని అశోక్ నగర్ లో జరిగింది.
అశోక్ నగర్ లో ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్న యువతి పెళ్లి కాకుండానే తల్లి అయింది. గుట్టు చప్పుడు కాకుండా ఇంటిలోనే ప్రసవం అయింది. ఆ తర్వాత సమాజం ముందు తలదించుకోవాల్సి వస్తుందని భయపడి కిటికీలో నుంచి కొడుకుని కిందకు విసిరేసింది. ఎవరికీ తెలియదు అనుకుంది. కానీ అపార్ట్ మెంట్ కింద ఉన్నవారు ఆ ఘోరాన్ని చూశారు. బిడ్డను ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయాడు.
బిడ్డ కోసం ప్రాణం వదిలిన తల్లి ఓవైపు, తన పరువు కోసం బిడ్డ ప్రాణం తీసిన దుర్మార్గురాలు ఇంకోవైపు.. ఒకేరోజు జరిగిన ఈ వేర్వేరు ఘటనలు రెండు కోణాల్ని బయటపెట్టాయి.