జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మధ్య మొదలైన వివాదం మరింత ముదురుతోంది. తాజాగా నటుడు పోసాని కృష్ణమురళి ముద్రగడకు సపోర్ట్‌గా మాట్లాడుతూ పవన్‌పై విరుచుపడ్డారు. ముద్రగడ గొప్ప లీడర్ అని.. ఆయన ఏ రోజు రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందలేదని అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ నీచంగా మాట్లాడం దారుణం అంటూ మండిపడ్డారు. పవన్ వెంటనే ముద్రగడకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు స్కెచ్ ప్రకారం కాపు నేతలపై పవన్ నీచంగా మాట్లాడుతున్నారని.. దాదాపు 30 సంవత్సరాల నుండి ముద్రగడ కాపుల కోసం పోరాడుతున్నారని.. కాపుల కోసం ముద్రగడ ఆస్తిని, పదవులను కోల్పోయారన్నారు. కాపుల కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి అని.. ముద్రగడ ఎనాడైనా తప్పు చేసినట్లు పవన్ నిరూపించలగలరా? అంటూ ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ తప్పు చేస్తున్నావ్ అంటూ హెచ్చరించారు. పవన్ వల్లే కాపుల్లో చిచ్చు మొదలైందన్నారు.
కమ్మ కులంలో పుట్టిన తనే కాపు కులానికి.. కాపు నాయకులను గౌరవం ఇస్తానని.. అలాంటిది కాపు కులంలో పుట్టిన పవన్ వారికి మర్యాద ఇవ్వకపోవడం దారుణం అన్నారు. కాపుల్ని తిడుతూ నువ్వే వారిని దూరం చేసుకుంటున్నావని హెచ్చరించారు. చంద్రబాబు ఏ రోజు తన వర్గం నేతలను తిట్టలేదని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ కాపులను తిట్టి చంద్రబాబును పొగడ్డమేంటని ప్రశ్నించారు.
లోకేశ్, చంద్రబాబు కంటే పవన్‌కళ్యాణ్ చాలా మంచివాడని.. ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయాడో అర్థం కావడం లేదన్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్ అవినీతి పరులు అని తిట్టిన నోటీతోనే ఇప్పుడు ఆయన సీఎం అవ్వాలనుకోవడం వెనుక ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు.