కడప నగర నడిబొడ్డున అందరూ చూస్తుండగానే వైసీపీ యువ కార్యకర్త శ్రీనివాసులరెడ్డి (30) హత్యకు గురయ్యాడు. కడప నగరంలో ల్యాండ్ సెటిల్‌మెంట్స్ హత్యకు దారి తీసినట్టు తెలుస్తోంది. హతుడు కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరు మండలం చిన్ననాగిరెడ్డిపల్లె నివాసి. అదే మండలానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడైన సీఎం జగన్ సమీప బంధువు, ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లిఖార్జున్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం.
మల్లిఖార్జున్‌రెడ్డి, ఆయన తమ్ముడు వీరారెడ్డి వెంట వుంటూ భూసంబంధిత సెటిల్‌మెంట్స్‌లో బాగా డబ్బు సంపాదించినట్టు సమాచారం. ఈ పరంపరలో శ్రీనివాసులరెడ్డి గ్రూప్‌లోనే కొందరితో అతనికి విభేదాలు వచ్చినట్టు సమాచారం. ఆ విభేదాలు కాస్త ప్రాణం తీసేవరకూ వెళ్లాయి.
నగరంలోని మారుతినగర్ ఆంజనేయస్వామి గుడి సమీపంలో శ్రీనివాసులరెడ్డి నివాసం ఉండేవాడు. ఎర్రముక్కపల్లి ఎస్‌బీఐ బ్రాంచ్ సమీపంలోని జిమ్ సెంటర్‌లో జిమ్ చేసుకుని ఉదయం 8 గంటలకు ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బురఖాల్లో వెళ్లి కొడవళ్లతో విచక్షణా రహితంగా నరికారు. కడప నగరం నడిబొడ్డున సంధ్యాసర్కిల్ కూడలిలో జరిగిన ఈ ఘటన నగరవాసులను భయకంపితుల్ని చేసింది.
కొన ఊపిరితో ఉన్న ఆ యువకుడిని రిమ్స్‌కు తరలించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. రిమ్స్‌లో మృతదే హాన్ని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లిఖార్జున్‌రెడ్డి, ఆయన తమ్ముడు వీరారెడ్డి తదితరులు సందర్శించారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే కోరారు. ఇదిలా వుండగా అధికార పార్టీకి చెందిన యువ కార్యకర్త హత్యకు గురి కావడం సంచలనం రేకెత్తిస్తోంది.
కడపలో కొందరు ముఠాగా ఏర్పడి ల్యాండ్ సెటిల్‌మెంట్స్ చేస్తూ, అడ్డొచ్చిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఠాలోని సభ్యుల మధ్యే ఆర్థిక లావాదేవీలు తీవ్ర విభేదాలకు దారి తీస్తున్నాయి. ఈ కోణంలోనే శ్రీనివాసులరెడ్డి హత్యను చూడాల్సి వుంటుంది.