తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పాత కథ రిపీట్ చేయడమేమిటి? ఇది రాజకీయ కక్ష కథ. ఒక్కసారి వెనక్కి వెళదాం. కొంతకాలం కిందట ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో రామానుజుల భారీ విగ్రహం ప్రతిష్టించడం, దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించడం తెలిసిందే. ఈ ఒక్క కార్యక్రమంలోనే కాకుండా మరో ప్రభుత్వ కార్యక్రమంలో కూడా మోడీ పాల్గొన్నారు.
కానీ ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ మోడీకి స్వాగతం పలకలేదు. ప్రభుత్వ కార్యక్రమానికి గానీ, ముచ్చింతల్ కు గానీ వెళ్ళలేదు. అప్పట్లో ఇది పెద్ద చర్చనీయాంశమైంది.
బీజేపీ మనిషన్న సాకుతో రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కూడా పక్కకు పెట్టారు. ఆమెను కూడా ప్రోటోకాల్ విషయంలో అనేకసార్లు అవమానించారు. ఈ విధంగా వాళ్ళిద్దరి మీదా కేసీఆర్ రాజకీయ కక్ష పెంచుకున్నారు. మోడీపై, కేంద్ర ప్రభుత్వం మీదా కేసీఆర్, కేటీఆర్, మంత్రులు అందరూ ప్రతిరోజూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పరుషమైన పదజాలం కూడా వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ తొందరలో మరోసారి హైదరాబాదుకు వస్తున్నారు.
ఈ నెల 26న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవం జరగబోతోంది. దానికి మోడీ హాజరవుతున్నారు.
ఈ కార్యక్రమానికి కేసీఆర్ ను కూడా ఆహ్వానించామని, కానీ ఉత్తరాది రాష్ట్రాల పర్యటనలో ఉన్నందున రాలేనని సమాచారం ఇచ్చారని ఐఎస్బీ డీన్ మీడియాకు చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడంలో భాగంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రముఖ నాయకులతో చర్చలు జరపడానికి ఐదు రోజుల కిందట కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు.
అక్కడ సీఎం కేజ్రీవాల్ తో మాట్లాడారు, తరువాత పంజాబ్ రాజధాని చండీఘడ్ వెళ్లారు. అక్కడ సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు, చైనాతో జరిగిన ఘర్షణల్లో చనిపోయిన సైనికుల కుటంబాలకు తెలంగాణా తరపున ఆర్ధిక సాయం చేశారు.
వాస్తవానికి ఆయన షెద్యూల్ ప్రకారం ఈ నెల 27న రాష్ట్రానికి తిరిగి రావాలి. కానీ ఆయన టూర్ ముగుంచుకుని రెండు రోజులముందే అంటే ఈరోజు తిరిగొస్తున్నారు.
ముందుగానే వచ్చేస్తున్నారు కాబట్టి ఆయన అనుకుంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవానికి హాజరు కాగలరు. కానీ ప్రధాని మోడీ వస్తున్నారు కదా. అందుకని దాదాపుగా వెళ్లకపోవచ్చు. స్వాగతం కూడా చెప్పకపోవచ్చు. ఎందుకంటే మొన్ననే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కాబట్టి పాత కథే రిపీట్ అవుతుందని అనుకుంటున్నారు. మళ్ళీ ఈసారి కూడా మోడీకి అవమానం తప్పదేమో.