శ్రీకాకుళం అచ్చి వచ్చిన ప్రదేశం. రాజకీయ జీవులు దీన్ని బాగా విశ్వసిస్తారు. సెంటిమెంట్ గా కూడా భావిస్తారు. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు బాదుడే బాదుడు ప్రోగ్రాం ఇక్కడే స్టార్ట్ చేశారు. ఇపుడు అధికార వైసీపీ కూడా శ్రీకాకుళం గడ్డనే ఎంచుకుంది.
గతంలో ఎన్నడీ లేని విధంగా మొత్తం క్యాబినేట్ లోని పాతిక మంది మంత్రులలో 17 మంది బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలుగా ఉన్నారు. ఇది నిజంగా ఒక రికార్డు. ఒక చరిత్ర. దాన్ని చాటడానికే సిక్కోలు నుంచి వైసీపీ మంత్రుల సామాజిక న్యాయ భేరీ రధం బయల్దేరబోతోంది.
శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ నుంచి ఈ నెల 26న బయల్దేరనున్న మంత్రుల బస్సు యాత్ర ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాలలో చుట్టేసి గోదావరి తీరం మీదుగా కోస్తాను కలుస్తుంది. అక్కడ నుంచి రాయలసీమ జిల్లాలలో తన ప్రయాణాన్ని సాగించి అనంతపురం వేదికగా అనంతమైన గళాన సామాజిక న్యాయ గర్జనను వినిపిస్తుంది.
దీనికి సంబంధించిన ఏర్పాట్లు శ్రీకాకుళంలో ఇప్పటికే పూర్తి అయ్యాయి. మంత్రులు అంతా ఒక్కొక్కరుగా వస్తున్నారు. అటు విశాఖ, ఇటు శ్రీకాకుళం నడిబొడ్డున ఉన్న విజయనగరంలో భారీ బహిరంగ సభ ఈ నెల 26న సాయంత్రం మంత్రులతో ఉంటుంది.
ఒక విధంగా చూస్తే జగన్ లేకుండా మంత్రులు చేస్తున్న తొలియాత్ర. జన స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా సామాజిక న్యాయ భేరీ ఏపీ అంతటా సమరభేరీ మోగించడానికి మంత్రులు సమాయత్తం కావడం రాజకీయ సంచలనం. దానికి శ్రీకాకుళం ముహూర్తం షాట్ గా వేదిక కావడం రాజకీయ అదృష్టంగానే అంతా చూస్తున్నారు.