సినిమాల్లో బ్ర‌ద‌ర్స్‌

మే 24, అన్న‌ద‌మ్ముల దినోత్స‌వం. అన్న‌ద‌మ్ములంటే వెంట‌నే గుర్తొచ్చేది రామాయ‌ణం. రామ‌ల‌క్ష్మ‌ణుల త‌ర్వాతే ఎవ‌రైనా. అన్న కోసం అడ‌వికి వెళ‌తాడు ల‌క్ష్మ‌ణుడు. క‌ష్టాలు ప‌డ‌తాడు, యుద్ధం చేస్తాడు. ల‌క్ష్మ‌ణుడు గాయ‌ప‌డిన‌పుడు రాముడు ఎందుకంత దుక్కిస్తాడంటే…

మే 24, అన్న‌ద‌మ్ముల దినోత్స‌వం. అన్న‌ద‌మ్ములంటే వెంట‌నే గుర్తొచ్చేది రామాయ‌ణం. రామ‌ల‌క్ష్మ‌ణుల త‌ర్వాతే ఎవ‌రైనా. అన్న కోసం అడ‌వికి వెళ‌తాడు ల‌క్ష్మ‌ణుడు. క‌ష్టాలు ప‌డ‌తాడు, యుద్ధం చేస్తాడు. ల‌క్ష్మ‌ణుడు గాయ‌ప‌డిన‌పుడు రాముడు ఎందుకంత దుక్కిస్తాడంటే అలాంటి త‌మ్ముడు ఇంకెవ‌రికీ వుండ‌డు కాబ‌ట్టి.

భార‌తంలో ధ‌ర్మ‌రాజు మీద గౌర‌వంతో మిగిలిన త‌మ్ముళ్లు క‌ష్టాలు ప‌డ‌తారు. జూదం ఆడ‌కుండా అడ్డుకుని వుంటే భార‌త‌మే లేదు. అన్న‌ద‌మ్ములిద్ద‌రూ మంచి వాళ్లైతే స‌రే, ఒక‌డు చెడ్డ‌వాడైతే వాలీసుగ్రీవులు.

మ‌న సినిమాల్లో అన్న‌ద‌మ్ముల క‌థ‌లు లెక్క‌లేన‌న్ని. అన్న‌ద‌మ్ములు విడిపోయి చివ‌రికి క‌లుసుకోవ‌డం ఎవ‌ర్‌గ్రీన్ ఎమోష‌న్‌. చిన్న‌ప్పుడు విల‌న్ వ‌ల్ల చెల్లాచెదురై ఆఖ‌ర్లో ఒక పాట‌తో క‌లుసుకుంటారు. సినిమా బాగా తీస్తే జ‌నం లాజిక్ వెత‌క‌రు. అందుకే యాదోంకి బారాత్ సూప‌ర్‌హిట్ (తెలుగులో అన్న‌ద‌మ్ముల అనుబంధం). అన్న‌ద‌మ్ముల్లో ఒక‌రు గ్యాంగ్‌స్ట‌ర్‌, ఇంకొక‌రు పోలీస్ ఆఫీస‌ర్ అయితే దీవార్ (తెలుగులో మ‌గాడు). అన్న‌ద‌మ్ములు వేర్వేరుగా పెరిగి ఘ‌ర్ష‌ణ ప‌డితే అన్న‌ద‌మ్ముల స‌వాల్ (కృష్ణ‌, ర‌జ‌నీకాంత్‌). తాము ఎదురించే కలెక్టరు త‌మ్ముడు అని తెలిస్తే ద‌ళ‌ప‌తి (ర‌జ‌నీకాంత్‌).

అన్న‌ద‌మ్ముల్లో ఒక‌రు గాయ‌కుడు, ఇంకొక‌డు దొంగ అయితే భ‌లేత‌మ్ముడు (1969). చైనా ట‌వున్ హిందీ సినిమా దీనికి ఆధారం. ర‌ఫి పాట‌లు సూప‌ర్‌హిట్‌. దొంగ‌స్థానంలో ఇంకొక‌రు డెన్‌లోకి ఎంట‌ర్ కావ‌డం మెయిన్ స్టోరీ. ఇదే క‌థ అమితాబ్ డాన్‌. అయితే హీరోలు అన్న‌ద‌మ్ములు కాదు. భ‌లేత‌మ్ముడు తీసిన NTR, అదే క‌థ‌ని యుగంధ‌ర్‌గా (డాన్ రీమేక్‌) న‌టించ‌డం విశేషం.

మ‌న సినిమా క‌థ‌ల‌కి ముత్తాత ఒకాయ‌న వున్నాడు. పేరు అలెగ్జాండ‌ర్ డ్యూమా. 1844లో ఫ్రెంచిలో ది కోర్సిక‌న్ బ్ర‌ద‌ర్స్ న‌వ‌ల రాసాడు. స‌యామి క‌వ‌ల‌లుగా పుట్టిన అన్న‌ద‌మ్ములు విడిపోయి వేర్వేరుగా పెరుగుతారు. ఇద్ద‌రిలో సేమ్ ఎమోష‌న్స్‌, ఫీలింగ్స్ వుంటాయి. విఠ‌లాచార్య ఈ క‌థ‌ని అగ్గిపిడుగు (1964) తీస్తే ఇదే క‌థ‌ని కొంచెం మోడ్ర‌న్ చేసి 1994లో హ‌లోబ్ర‌ద‌ర్ తీశారు.

వైద్యం రాక‌పోయినా ఒక డాక్ట‌ర్ ప్లేస్‌లో ఒక అల్ల‌రిచిల్ల‌రి యువ‌కుడు వైద్యం చేస్తే సొమ్మొక‌డిది, సోకు ఒక‌డిది (1979). చివ‌రికి వాళ్లు అన్న‌ద‌మ్ముల‌ని తెలుస్తుంది. సీటు రాక‌పోయినా MBBS చ‌దివితే శంక‌ర్‌దాదా.

చిన్న‌ప్ప‌టి నుంచి చ‌దివించిన అన్న కోసం త‌మ్ముడు త‌న ప్రేమ‌ని త్యాగం చేస్తే మంచి మ‌న‌సులు. అన్న‌ద‌మ్ములిద్ద‌రూ మారువేషాల‌తో నాట‌కం ఆడి పెళ్లిళ్లు చేసుకుంటే గుండ‌మ్మ‌క‌థ‌. వ‌దిన సాయంతో అన్న‌ని త‌మ్ముడు చ‌క్క‌దిద్దితే కోడ‌లుదిద్దిన కాపురం.

అన్యోన్యంగా వున్న అన్న‌దమ్ములు, భార్య‌ల వల్ల విడిపోతే ఉమ్మ‌డి కుటుంబం (1967). ఇదే క‌థ చిన్న‌చిన్న మార్పుల‌తో పండంటి కాపురం (1972). కుటుంబాన్ని కాపాడ్డానికి త‌న ఐడెంటిటీ బ‌య‌ట పెట్ట‌ని అన్న క‌థ బాషా (1995). త‌మ్ముడు చెడ్డ‌వాడై అన్న‌ను పీడిస్తే జ‌గ‌దేక‌వీరుని క‌థ (1961). అన్న‌ద‌మ్ములు విడిపోయి వేర్వేరు మ‌తాల్లో పెరిగితే అమ‌ర్ అక్బ‌ర్ ఆంథోని (తెలుగులో రామ్ రాబ‌ర్ట్ ర‌హీం).

చిన్న‌ప్పుడు విడిపోయిన అన్న‌ద‌మ్ములు ఒక‌రి ప్లేస్‌లో ఇంకొక‌రు వెళితే రాముడు భీముడు (1964). షేక్‌స్పియ‌ర్ కామెడీ ఆఫ్ ఎర్ర‌ర్స్ నాట‌కం ఇదే. సంజీవ్‌కుమార్‌తో అంగూర్ (1982, గుల్జార్ డైరెక్ష‌న్‌) సినిమా వ‌చ్చింది. గుల్జార్ మంచోడు కాబ‌ట్టి షేక్‌స్పియ‌ర్‌కి క్రెడిట్ ఇచ్చాడు. మ‌న తెలుగులో చాలా మంది సొంత పేర్లు వేసేసుకున్నారు.

సినిమాలు కూడా ఆయా కాల ప‌రిస్థితుల్ని రికార్డ్ చేస్తాయి. 1950-60 మ‌ధ్య‌లో అన్న‌ద‌మ్ముల ప్రేమ, అనుబంధం సినిమాల్లో క‌నిపించేది. 60-80 మ‌ధ్య‌లో వ‌ల‌స‌లు, ప‌ట్ట‌ణీక‌ర‌ణ పెరిగింది. ఉమ్మ‌డి కుటుంబాలు విడిపోయి మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం ఉండేది. 70 త‌ర్వాత హీరోలో ఉదాత్త‌త పోయి మాఫియా డాన్‌, రౌడీ వచ్చాడు. అన్న‌ద‌మ్ముల అనుబంధంలో కూడా ఈ మార్పులొచ్చాయి.

ఇపుడొస్తున్న సినిమాల్లో ఎపుడో త‌ప్ప ఈ ఎమోష‌న్ ట‌చ్ చేయ‌డం లేదు. కుటుంబ ప్రేమ‌లు, ద్వేషాలు అన్నీ టీవీల్లోకి షిప్ట్ అయ్యాయి. అన్న‌ద‌మ్ముల క‌థ‌ని స‌రిగ్గా ప్ర‌జెంట్ చేస్తే ఎపుడూ హిట్ ఫార్ములానే.

జీఆర్ మ‌హ‌ర్షి