వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేయడంలో బీజేపీలోని టీడీపీ అభిమానులు ఉత్సాహంగా వుంటారు. సొంత పార్టీ కంటే టీడీపీని బలో పేతం చేయడంపైనే వాళ్ల దృష్టి.
తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ‘ప్రత్యేక’ ఇంటర్వ్యూ కూడా ఆ కోణంలోనే చూడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకలా మారుతుందని టీడీపీ పలుకులే ఆమె పలుకుతున్నారు. ఇటీవల బీజేపీలోని టీడీపీ వీరాభిమాన నేతలు సొంత పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరించడాన్ని చూస్తున్నాం.
అప్పులు, ఉచిత పథకాలే శ్రీలంక దుస్థితికి కారణమని ప్రపంచం కోడై కూస్తోందని పురందేశ్వరి చెప్పుకొచ్చారు. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, సుమారు రూ.8 లక్షల కోట్ల రుణ భారం ఉందన్నారు. సంక్షేమ పథకాలను వద్దని పురందేశ్వరి చెప్పదలుచుకున్నారా? సంక్షేమ పథకాల అమలుకే ఏపీ సర్కార్ అప్పులు చేస్తోంది. ఆ సొమ్మంతా పేద ప్రజల ఖాతాల్లోకి వెళుతున్న విషయాన్ని పురందేశ్వరి మరిచారా?
శ్రీలంక దుస్థితికి ఏపీ మారిపోవడానికి సంక్షేమ పథకాల అమలే కారణమని విమర్శించే వరకూ ఆమె వెళ్లారంటే… టీడీపీ ప్రయోజనాల కోసం పార్టీని బలిపెట్టడానికి సిద్ధమయ్యారనే సంకేతాల్ని ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితులు లేవన్నారామె. కక్షపూరిత పరిపాలన వల్లే పెట్టుబడులు పెట్టినవారు వెనక్కి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు. కొత్త పెట్టుబడులు రావడంలేదని, ఉపాధి అవకాశాలు కూడా సరిగా లేవని పురందేశ్వరి విమర్శించారు.
విశాఖలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు జగన్ కక్షపూరిత పాలన కారణమా? అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడులు వెల్లువెత్తుతాయని గత 8 ఏళ్లుగా వైఎస్సార్‌సీపీతో పాటు ఏపీలోని వివిధ ప్రజాసంఘాలు చేస్తున్న ఉద్యమాలు పురందేశ్వరికి తెలియవా? ఏపీ అభివృద్ధిని నిజంగా కాంక్షిస్తుంటే ప్రత్యేక హోదా ఇచ్చేలా జాతీయ స్థాయిలోని తమ ప్రభుత్వంపై పురందేశ్వరి ఎందుకు ఒత్తిడి తేవడం లేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
అద్భుతంగా ఆలోచించి ఆదాయం పెంచుకోడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే కదా! పురందేశ్వరి ఆరోపిస్తున్నట్టు ఏపీలో ఆందోళనకర పరిస్థితులన్నింటికి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీనే కారణం. ఇందులో రెండో మాటకే స్థానం లేదు. అందుకే ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి కారణమని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. తామేదో దేశాన్ని సుసంపన్న భారతంగా మారుస్తున్నట్టు పురందేశ్వరి ‘ప్రత్యేక’ కామెడీ నవ్వు తెప్పిస్తోంది.
పురందేశ్వరి మరో సరదా కామెంట్ గురించి తప్పక తెలుసుకోవాలి. 175 స్థానాలను గెలవడమే బీజేపీ టార్గెట్‌గా చెప్పుకొచ్చారు. అలాగే జనసేనతో ఇప్పటికే పొత్తు ఉందని ఆమె మరోసారి జోక్ పేల్చారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీ చేయని ఆత్మకూరు, బద్వేల్ ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోని బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో ఎదిగిందని చెప్పడం పురందేశ్వరికే చెల్లింది. ఈ లెక్కన 175 స్థానాలు టార్గెట్ అంటే డిపాజిట్ దక్కించుకోడమా? లేక ఇంకా ఏదైనా ఉందా? అని నెటిజన్లు తమ సృజనకు పదును పెట్టారు.
పురందేశ్వరి ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా వైఎస్సార్‌సీపీపై అక్కసు, ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై మాట మాత్రం అనకుండా అభిమానాన్ని చాటుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కదా బీజేపీలోని టీడీపీ నేతల ‘ప్రత్యేకత’.