వైఎస్సార్‌సీపీని, జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఎల్లో పత్రిక ఇవాళ మాత్రం టీడీపీకి చురకలంటించడం విశేషం.
ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అడగకుండానే వైసీపీతో పాటు టీడీపీ కూడా మద్దతు ఇచ్చిందని సదరు ఎల్లో పత్రిక కథనం సారాంశం. ద్రౌపది ముర్ముకు మద్దతు విషయంలో వైసీపీ, టీడీపీ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయని ఎల్లో పత్రిక ఏకిపారేయడం గమనార్హం.
బీజేపీపై కోపంతోనే ఈ కథనాన్ని రాసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారణాలేవైనా టీడీపీని కూడా టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా గిరిజన మహిళ కాబట్టే ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చామని వైసీపీ, టీడీపీ చేస్తున్న వాదనలో నిజం లేదని ఆ పత్రిక స్పష్టం చేసింది.
2012లో బీజేపీ మద్దతుతో మేఘాలయకు చెందిన పీఏ సంగ్మా అనే గిరిజన నేత రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ పార్టీలు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించడం ఆకట్టుకుంది.
నాడు యూపీఏ అభ్యర్థిగా ప్రణబ్‌ముఖర్జీ బరిలో నిలిచారు. అప్పటికి యూపీఏ ప్రభుత్వం పెట్టిన కేసుల్లో జగన్ జైల్లో ఉన్నారు. అయినప్పటికీ పీఏ సంగ్మాని కాదని ప్రణబ్‌కు జగన్ మద్దతు ఇచ్చారు. గిరిజనుడైన సంగ్మాకు టీడీపీ మద్దతు ఇవ్వని విషయాన్ని ఎల్లో పత్రిక గుర్తు చేయడం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీ రెంటికీ దూరమంటూ ఓటింగ్‌ను టీడీపీ బహిష్కరించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
టీడీపీ మద్దతును బీజేపీ కోరినట్లు ఎక్కడా బయటకు రాలేదని ఎల్లో పత్రిక నిఖార్సైన నిజాన్ని బయట పెట్టింది. ద్రౌపది గిరిజన మహిళ కావడం వల్లే సామాజిక న్యాయ కోణంలో మద్దతిస్తున్నామని టీడీపీ తనకు తానుగా ప్రకటన విడుదల చేసిందనే వాస్తవాన్ని ఎల్లో పత్రిక బయట పెట్టడం రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది.
టీడీపీ తప్పిదాల్ని దాచిపెట్టడం, లేనిగొప్పను చెప్పడమే కర్తవ్యంగా పని చేస్తున్న ఎల్లో పత్రిక …ఇవాళ మాత్రం ఎందుకనో టీడీపీపై ఆగ్రహాన్ని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.