వాజ్ పేయ్ తరం నాయకుడు తరలిపోయాడు

ఆయన భారతీయ జనతా పార్టీలో వరిష్ట నాయకుడు. పీవీ చలపతిరావు పేరు తెలియని వారు ఎవరూ లేరు. ఎనిమిదిన్నర పదుల వయసులో ఆయన నిన్న తనువు చాలించారు. జనసంఘ్ కాలం నుంచి పనిచేస్తూ వచ్చిన…

ఆయన భారతీయ జనతా పార్టీలో వరిష్ట నాయకుడు. పీవీ చలపతిరావు పేరు తెలియని వారు ఎవరూ లేరు. ఎనిమిదిన్నర పదుల వయసులో ఆయన నిన్న తనువు చాలించారు. జనసంఘ్ కాలం నుంచి పనిచేస్తూ వచ్చిన ఆయన రెండు సార్లు ఉత్తరాంధ్రా జిల్లాల ఎమ్మెల్సీగా పనిచేశారు.

బీజేపీగా మారాక ఉమ్మడి ఏపీకి ఆయన ఆ పార్టీ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. ఉత్తరాంధ్రాకు బీజేపీకి పరిచయం చేసిన నేతగా పీవీకి గుర్తింపు ఉంది. బీసీ నేతగా మేధావిగా పేరుపడిన పీవీకి పదవులు మాత్రం దూరంగా ఉండిపోయాయి.

ఆయన శిష్యరికం చేసిన ఎంతో మంది జాతీయ స్థాయిలో బీజేపీలో వెలుగు వెలిగారు. పీవీకి మాత్రం కనీసం గవర్నర్ పదవి కూడా దక్కలేదు. ఆయన సేవలను గుర్తించి వాజ్ పేయ్ అప్పట్లో కీలక పదవి ఇద్దామనుకున్నా ఆయన వల్ల పైకి వచ్చి తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి రాణించిన నాయకులు అడ్డుకోవడం వల్లనే చేతిదాకా వచ్చిన పదవి నోటి దాకా రాలేదు అంటారు.

ఈ రోజు దేశాన్ని ఏలుతున్న ప్రధాని నరేంద్ర మోడీ సైతం పీవీ గురించి చాలా సార్లు తలచుకోవడమే కాదు ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ వచ్చారు. రాజకీయంగా ఆరున్నన పదుల జీవితాన్ని చూసిన పీవీ చలపతిరావు వాజ్ పేయ్ ఎల్కే అద్వానీ తరం వాడిగా చివరి వారిగా ఉంటూ తన జీవన ప్రయాణాన్ని ముగించారు.

ఆయనకు ప్రభుత్వ అధికార లంచనాలతో అంతిమ సంస్కారం నిర్వహించేందుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం అవుతోంది. పీవీకి నివాళులు అర్పించిన మంత్రి గుడివాడ అమరనాధ్ మాట్లాడుతూ పీవీ మరణవార్తను ముఖ్యమంత్రి జగన్ కి తెలియచేస్తే ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించాలని ఆదేశించారని పేర్కొన్నారు. సొంత పార్టీలో అనుకున్న గుర్తింపు పొందలేకపోయిన పీవీకి రాష్ట్ర ప్రభుత్వం అంతిమ నివాళి ఘనంగా అందించడం ముదావహం అని ఆయన అభిమానులు అంటున్నారు.