టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాస్‌రెడ్డి కడప పార్లమెంట్, అలాగే ప్రొద్దుటూరు టికెట్లపై క్లారిటీ ఇచ్చారు. ఆయన కామెంట్స్ ప్రొద్దుటూరు టీడీపీలో రచ్చకు దారి తీసేలా ఉన్నాయి. అయితే ప్రొద్దుటూరు టీడీపీ టికెట్‌పై ఆయన స్పష్టత ఇవ్వడంతో, ఫలితం ఎలా వుంటుందో కూడా తేల్చి చెప్పినట్టైంది.
రెండేళ్ల క్రితమే కడప పార్లమెంట్ అభ్యర్థిగా తన పేరును చంద్రబాబునాయుడు ప్రకటించారని మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. ఇదే సందర్భంలో ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ తమకంటే తమకని కొందరు నేతలు ప్రకటించుకుంటున్నారని, దీనిపై ఏమంటారని మీడియా ప్రతినిధులు ఆయన్ను ప్రశ్నించారు. ప్రొద్దుటూరులో గందరగోళ పరిస్థితులకు తెరపడేది ఎప్పుడనే ప్రశ్నకు ఆయన నేరుగానే సమాధానం ఇచ్చారు.
ఏడాదిన్నర క్రితం కడప సెంట్రల్ జైలు సాక్షిగా ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి ప్రవీణే అని లోకేశ్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. లోకేశే ప్రకటించిన తర్వాత ఇక తాము చెప్పేదేముందని ఆయన ప్రశ్నించారు. అసలు ప్రొద్దుటూరులో గందరగోళ పరిస్థితి వుంటే కదా, తొలగించడానికి అని ఆయన అనడం గమనార్హం. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అధికారికంగా అందరి పేర్లు ప్రకటిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రొద్దుటూరులో టికెట్ ఆశావహులు ఎక్కువగా ఉన్నారన్నారు. పార్టీ అధికారంలోకి వస్తుందనే వాతావరణం ఉన్నప్పుడే సహజంగానే పోటీదారులు ఉంటారని ఆయన తెలిపారు.
ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ప్రవీణ్‌కే ఇస్తే… ఆ నియోజకవర్గం ముచ్చటగా మూడోసారి వైసీపీ ఖాతాలో పడ్డట్టే అనే చర్చకు తెరలేచింది. ప్రవీణ్ అభ్యర్థి అయితే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిని ఎదుర్కోవడం కష్టం.
రాచమల్లుపై సొంత పార్టీలో అసమ్మతి ఉన్నప్పటికీ, అటు వైపు బలమైన ప్రత్యర్థి లేకపోతే ఎవరూ టీడీపీలో చేరే పరిస్థితి వుండదు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి టికెట్ ఇస్తే బిగ్ ఫైట్ అని చెప్పక తప్పదు. కానీ ప్రొద్దుటూరు టికెట్ ఆయనకు ఇచ్చే పరిస్థితి లేదు. కావున ఎన్నికలకు ముందే ప్రొద్దుటూరు సీటు అధికార పార్టీ ఖాతాలో పడిందనే మాట టీడీపీ నేతల నుంచే రావడం విశేషం.