మార్గదర్శి, రామోజీరావు తరపున లాయర్ కాని లాయర్ వకల్తా పుచ్చుకున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్, అలాగే రామోజీరావు ఎలాంటి తప్పులు చేయలేదని ఆ అనధికార న్యాయవాది బలమైన వాదన వినిపిస్తున్నారు. ఆ లాయర్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. అయితే ఆయన వాదిస్తున్నది ఏ న్యాయ స్థానంలోనో కాదండోయ్. ఢిల్లీలో తాను ముందే మాట్లాడుకుని పిలిపించుకున్న మీడియా ప్రతినిధుల ఎదుట కావడం గమనార్హం.
రామోజీరావుకు పైసా ఖర్చు లేకుండా ఆయనతో పాటు మార్గదర్శి చిట్‌ఫండ్ ఘన కార్యం గురించి రఘురామకృష్ణంరాజు రోజూ డెయిలీ సీరియల్‌ను తలపించేలా గొప్పలు చెబుతున్నారు. మార్గదర్శిపై కోర్టులో ఎవరేం మాట్లాడుతున్నారో జనానికి పెద్దగా తెలియదు. కానీ ఈ లాయరే కానీ లాయర్ గారు మాత్రం … తెలుగు సమాజం ఆస్తి రామోజీ అంటూ కీర్తించారు. రామోజీని రఘురామ ఒక్కడు పొగిడితే, సోషల్ మీడియాలో వందలాది మంది ఆయన మాటలను తీసుకుని తిడుతున్నారు.
ఔను మీరు చెప్పినట్టు, వందలాది మంది పేదల అసైన్డ్ భూముల్ని అప్పనంగా లాక్కొని రామోజీ ఫిల్మ్ సిటీ అనే ప్రతిసృష్టి చేశారని దెప్పి పొడుస్తున్నారు. అలాగే సృష్టికి ప్రతిసృష్టి అయిన రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించాలంటే వేల రూపాయలు ముట్టచెప్పాల్సి వస్తోందని విమర్శిస్తున్నారు. మార్గదర్శిలో డిపాజిట్లపై సాక్షి పత్రికలో రాసిన కథనంపై ఈ లాయర్ కాని లాయర్ తనదైన వాదన వినిపించారు.
డిపాజిట్ల మొత్తం సొమ్ము కేవలం రూ.50-60 కోట్లు మాత్రమే అని రఘురామ వాదించారు. తనకు వివరాలన్నీ తెలుసని, తన దగ్గరికి సాక్షి పత్రిక వస్తే చర్చిస్తానని చెబుతున్నారాయన. అతి అంటే ఇదే. సీఎం జగన్‌కు వ్యతిరేకలందరి సమస్య తనదే అని రఘురామ భావిస్తున్నట్టున్నారు. అలాగని ధైర్యం చేసి ఆంధ్రాకు వెళ్లి, వైసీపీకి వ్యతిరేక రాజకీయాలు చేస్తారా? అంటే అదీ లేదు.
ఎంతసేపూ ఢిల్లీలో కూచుని… ఉత్తర కుమార ప్రగల్భాలకు తక్కువేం లేదు. ఇలా అతి చేయడం వల్లే సమస్యల్ని కొని తెచ్చుకున్నానన్న వాస్తవాన్ని రఘురామ గ్రహించినట్టు లేరు. చర్యకు ప్రతి చర్య వుంటుందని సైన్స్ చెబుతుంది. ఇందుకు రఘురామైనా, రామోజీరావైనా అతీతులు కారని అనేక పరిణామాలు నిరూపించాయి.