రఘురామకృష్ణంరాజు తెల్లారి లేచినప్పటి నుంచి సొంత పార్టీని తిడుతుంటారు. ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే …తాను తిడుతున్న పార్టీ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం లేకపోతే పట్టించుకునే దిక్కేలేదని. ఎంపీ టికెట్ ఇచ్చి, గెలిపించి, రాజకీయంగా గుర్తింపు, గౌరవం రావడానికి కారణమైన వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీలపై ఎలా నోరు పారేసుకుంటున్నారో ఆయనకే తెలియాలి. ఈ అతిచేష్టలే తనకు ఇబ్బందులు తెచ్చాయని ఆయన గ్రహించినట్టు లేరు.
పుట్టుకతో వచ్చిన బుద్ధి, పుడుకులతో గానీ పోదు అనే చందాన, రఘురామకృష్ణంరాజు వైఖరి వుంటుందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైసీపీ మంత్రులు కన్నూమిన్నూ కానకుండా మాట్లాడాలని ఆయన గారు హితవు చెబుతున్నారు. ఇదే సూత్రం తనకు వర్తిస్తుందని ఆయన గుర్తించాల్సి వుంది. ఢిల్లీలో కూచుని భారీ డైలాగ్‌లు కొట్టే రఘురామ పొరపాటున కూడా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్లరు.దీన్ని బట్టి రఘురామ ఎంత “ధైర్యపరుడో” అర్థం చేసుకోవచ్చు.
మనిషన్న తర్వాత వయసు, అనుభవాలు పెరుగుతున్న క్రమంలో మానసికంగా ఎదుగుతారు. తప్పులపై పశ్చాత్తాపం చెందుతూ, తమ వైఖరిని మార్చుకుంటూ వుంటారు. కొందర్ని చూస్తే వయసు, అనుభవాలు పెరుగుతున్నా బుద్ధి రాకపోగా, మరింత పతనం అవుతుంటారు. ఈ రెండింటిలో రఘురామకృష్ణంరాజు ఏ కేటగిరీ బాపతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
రెబల్‌స్టార్ కృష్ణంరాజు కుటుంబానికి అండగా ఉంటామని సీఎం జగన్ చెప్పడాన్ని కూడా రఘురామ ఓర్వలేకపోతున్నారు. కృష్ణంరాజు పేరిట రెండెకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయంపై కనీసం హర్షం వ్యక్తం చేసే సంస్కారం కూడా ఆయనలో కరువైంది. పైగా రాజుల ఓట్లన్నీ గంపగుత్తగా వస్తాయనే ఎత్తుగడతో ప్రభుత్వం వ్యవహరించిందనే విమర్శకు దిగారు.
ఇంతకంటే దిగజారుడుతనం ఏదైనా వుంటుందా? ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీకైనా ఒక కులం ఓట్లన్నీ గంపగుత్తగా పడతాయా? టీడీపీకి కమ్మ, వైసీపీకి రెడ్ల ఓట్లన్నీ గంపగుత్తగా పడే పరిస్థితి వుందా? ఎప్పటికీ జరగదు.
తన విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సామాజిక వర్గంలో సానుభూతి లేదని రఘురామకృష్ణంరాజు భావిస్తున్న ట్టున్నారు. తన వెంట రాజులంతా వున్నారని రఘురామ భావిస్తున్నట్టైతే, ఆయన నోట ఇలాంటి మాటలు వచ్చేవి కావని చెప్పొచ్చు. ప్రజలతో, వాస్తవాలతో సంబంధం లేకుండా రాజకీయాలు చేసే వాళ్లెవరైనా సింగిల్ టైమ్ ప్రజాప్రతినిధిగా మిగిలి పోవాల్సిందే. భవిష్యత్‌లో ఇందుకు ఉదాహరణగా రఘురామ గురించి జనం చెప్పుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి.
ఇతర పార్టీలకు పావుగా ఉపయోగపడే నేతల్ని ప్రజలు ఎప్పటికీ పట్టించుకోరు. అదే రఘురామను రాజకీయంగా జనానికి దూరం చేసింది. ఎంతసేపూ అనుకూల మీడియాలో పేరు కనిపించేలా వ్యవహరిస్తూ ఉనికి చాటుకోవడం తప్ప, ఒరిగేదేమీ లేదు. అది కూడా వైసీపీ ఎంపీ అనే బ్రాండ్ నేమ్ ఉండడం వల్లే ఈ మాత్రమైనా ప్రత్యర్థులు అక్కున చేర్చుకున్నారనేది బహిరంగ రహస్యమే.