ఏహే…ర‌ఘురామ ఇంత పిరికోడా?

ప్ర‌తిరోజూ ర‌చ్చ‌బండ పేరుతో వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ర‌చ్చ‌ర‌చ్చ చేస్తుంటారు. మా పార్టీ, మా ప్ర‌భుత్వం అంటూ ఏపీ స‌ర్కార్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ఇదంతా ఢిల్లీ కేంద్రంగా ర‌ఘురామ‌కృష్ణంరాజు సాగిస్తున్న వ్య‌వ‌హారం.…

ప్ర‌తిరోజూ ర‌చ్చ‌బండ పేరుతో వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ర‌చ్చ‌ర‌చ్చ చేస్తుంటారు. మా పార్టీ, మా ప్ర‌భుత్వం అంటూ ఏపీ స‌ర్కార్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ఇదంతా ఢిల్లీ కేంద్రంగా ర‌ఘురామ‌కృష్ణంరాజు సాగిస్తున్న వ్య‌వ‌హారం. జ‌గ‌న్ మొద‌లుకుని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి… ఇలా వైసీపీ ముఖ్య నేత‌ల‌పై ఆయ‌న ఇష్టానుసారం నోరు పారేసుకోవ‌డం చూస్తుంటాం.

ఇవ‌న్నీ ప్ర‌సారం చేయ‌డానికి ఎల్లో మీడియా అన్ని వేళ‌లా సిద్ధంగా వుంటుంది. సొంత ప్ర‌భుత్వాన్నే ఇర‌గ‌దీస్తున్నాడంటే… ఎంత ధైర్యం వుండాలి? అనే ప్ర‌శ్న ఎవ‌రికైనా వ‌స్తుంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని, వైసీపీ నేత‌ల‌ను ప్ర‌త్యేకంగా పేరు పెట్టి మ‌రీ తిడుతూ చ‌క్క‌టి హావ‌భావాల‌ను ఆయ‌న ప్ర‌ద‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ఘురామ‌లో అనేక కోణాలున్నాయి. ఆయ‌న‌లో ఓ క‌మెడియ‌న్‌, ఓ సీరియ‌స్ యాక్ట‌ర్‌, అలాగే ఎమోష‌న్స్‌ను పండించే న‌ట‌నా చాతుర్యం దాగి ఉంది. అందుకే కాబోలు ఆయ‌న‌కు చిత్ర ప‌రిశ్ర‌మ‌తో అవినాభావ సంబంధం వుంది.

ఆయ‌న‌లో మ‌న‌కెవ‌రికీ క‌నిపించ‌ని మ‌రో కోణం కూడా ఉంది. అదే భ‌యం. ఏపీ సీఐడీ పేరు వింటే చాలు….ఆయ‌న‌కు తెలియ‌కుండానే మ‌న‌సు స్వాధీనం త‌ప్పుతుంది. నోట మాట రాదు, నిలువెల్లా వ‌ణుకు. ఇక సీఐడీ డీఐజీ సునీల్‌కుమార్ పేరు వింటేనా… ప్లీజ్ ఆ పేరు చెప్పొద్దు అంటూ గ‌ట్టిగా అరిచినంత ప‌ని చేస్తార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతుంటారు. ఏహే… ర‌ఘురామ ఎంతో ధైర్య‌స్తుడ‌నే ఎవ‌రైనా వాదించార‌ని అనుకోండి… అయితే తాజాగా సీఐడీ విచార‌ణ‌కు ఎందుకు హాజ‌రు కాలేదో చెప్పండి చూద్దాం అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.

ర‌ఘురామ‌కృష్ణంరాజును విచారించేందుకు ఏపీ హైకోర్టు నుంచి సీఐడీ అనుమ‌తి తీసుకుంది. ఏపీని నిత్యం తిట్టిపోసే ర‌ఘురామ‌, ఆ రాష్ట్రానికి వెళ్ల‌డానికి మాత్రం స‌సేమిరా అంటారు. దీంతో హైద‌రాబాద్‌లోని దిల్‌ఖుషా అతిథిగృహంలో 19, 20, 21 తేదీల్లో విచారించేందుకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. ర‌ఘురామ‌ను విచారించే నిమిత్తం లాయ‌ర్‌, వైద్య బృందంతో ఏపీ సీఐడీ సిద్ధమైంది. అయితే మొద‌టి రోజు విచార‌ణ‌కు ఆయ‌న డుమ్మా కొట్టారు.

అనివార్య కార‌ణాలంటూ సీఐడీకి స‌మాచారం ఇచ్చారు. బ‌హుశా సీఐడీ విచార‌ణ‌ను ఎదుర్కోడానికి ధైర్యం కూడ‌దీసుకోడానికి మ‌రికొంత స‌మ‌యం అవ‌స‌ర‌మేమో అంటూ సోష‌ల్ మీడియాలో సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ మాత్రం దానికి ప్ర‌గ‌ల్భాలు దేనిక‌య్యా ర‌ఘురామ అని మ‌రికొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.