ఎవరైనా తమ బలం ఎంత అని లెక్కలు వేసుకుంటారు. దాని తరువాత అవతలి వారి వీక్ నెస్ సంగతి చాటు తారు. సరే, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ వైనం వేరే కనుక తన బలం సంగతి పక్కన పెట్టి వైకాపా బలం ఇంతే అంటూ చాటింపు వేసారు. పోనీ ఇదో రకం పద్దతి అనుకుందాం. మరి పనిలో పనిగా మిగిలిన పార్టీల సంగతి కూడా చెప్పాలి కదా?
జనసేన సంగతి వదిలేయండి..దానికి అధికారం యావ లేదు. తొందర లేదు. అందువల్ల ఎన్ని సీట్లు వస్తాయన్నది చెప్పరు. మరి తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయో కూడా చెప్పాలి కదా? వైకాపా కు 65 లోపు సీట్లు వస్తే మిగిలిన సీట్లు ఎవరికి వెళ్తాయో క్లారిటీ ఇవ్వాలి కదా? అదీ లేదు.
పోనీ ఆ సంగతి అలా వుంచితే చాలా సర్వేలు జనసేన గురించి కూడా చెబుతున్నాయి. లేస్తే ఇంత ,,.కూర్చుంటే ఇంత అంటూ… లేస్తే అంటే ఒంటరిగా పోటీ చేస్తే…కూర్చుంటే అంటే తెలుగుదేశం తో కలిసి సందట్లో సడేమియా అన్నట్లు వెళ్లిపోతే. ఒంటరిగా పోటీ చేస్తే పట్టుమని పది సీట్లు రావంటున్నాయి ఆ సర్వేలు. అదే కనుక తెలుగుదేశంతో కలిస్తే డజనున్నర వరకు వస్తాయట. అంటే స్వంత బలం కన్నా, అదనపు బలమే మిన్న అని చెబుతున్నాయి.
చిత్రమేమిటంటే ఇలా చెప్పే సర్వేలు జనసేన కలవకున్నా తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. కానీ జనసేన కలిస్తే ఇంకా బాగా అధికారంలోకి వస్తుంది అంటున్నాయి. ఇక్కడ లాజిక్ అర్థం అవుతూనే వుంది.
జనసేనకు ఒంటరి పోటీ పనికిరాదు. తెలుగుదేశంతో కలిసే వెళ్లాలి అని పరోక్షవత్తిడి తెస్తున్నాయన్నమాట. ఇలాంటి సర్వేలను ‘తెలుగు’సర్వేలు అనికాక మరేం అనాలి. అయినా జనసేనకు కూడా ఇలాంటి సర్వేలే కావాలేమో? ఎందుకంటే ఇలాంటి సర్వేలు అన్నీ చూసి చూసి, లేదా చూపించి చూపించి జనసైనికులకు కూడా ‘మనకు వేరే గత్యంతరం లేదు’ తెలుగుదేశంతో కలిసి వెళ్లాల్సిందే అనే భావన కలిగించాలి కదా? అప్పుడు కదా..’కార్యకర్తల మనోభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నా’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు.
ఏమైనా సరే పవన్ కు నచ్చని ఒకే ఒక డైలాగు ‘సింహం సింగిల్ గా వస్తుంది’…అని అనుకోవాలేమో?