రామోజీరావు, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న మార్గదర్శి ఫైనాన్షియర్ సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ ప్రముఖ వార్తను రామోజీరావు నేతృత్వంలోని ఈనాడు మీడియా విస్మరించింది. లోకం బొక్కలు వెతికి మరీ వార్తలు వండే ఈనాడు… తమ అధిపతి మోసగింత సమాచారం ఎవరికీ తెలియవద్దని ఆశించింది. అయితే ఈనాడు పత్రిక రాస్తేనో, చూపుతేనో వాస్తవాలు తెలియని రోజులకు కాలం చెల్లింది.
అనేక రకాల మీడియా సంస్థలు పుట్టుకొచ్చాయి. ఒకటి కాకపోతే, మరో సంస్థ వాస్తవాల్ని బయటికి తీసేందుకు ముందుకొస్తున్నాయి. మార్గదర్శి ఫైనాన్షియర్‌ను అడ్డు పెట్టుకుని ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు రూ.2,600 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేశారు. రామోజీరావు మోసపూరిత వ్యాపారం చేస్తారంటే ఎవరూ నమ్మలేదు. కానీ నాటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ లోతుల్లోకి వెళ్లి, మోసాన్ని వెలికి తీశారు. చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ చేరింది.
రాష్ట్ర విభజనకు కేవలం ఒక్కరోజు ముందు తనపై నమోదైన కేసును ఉమ్మడి హైకోర్టులో రామోజీరావు కొట్టి వేయించుకున్నాడని ఉండవల్లి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కేసు అసలు సూత్రధారి, పాత్రధారి అయిన తనకు ఈ విషయం ఏడాది తర్వాత తెలిసిందని ఆశ్చర్యంతో ఆయన చెప్పడం విన్నాం.
ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్‌తో పాటు దాని అధినేత రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాలని నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలైన ఫిర్యాదును కొట్టి వేస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌తో పాటు రామోజీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, మార్గదర్శి ఫైనాన్షియర్, రామోజీరావులకు నోటీసులు జారీ చేసింది.
అదేంటోగానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన రామోజీరావు కేసుకు సంబంధించి ఈనాడు పత్రిక నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం గమనార్హం. ఇదే ఈనాడు పత్రికలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు ఆంధ్రప్రదేశ్‌లో అడ్డంకులు సృష్టిస్తున్నందున దాన్ని హైదరాబాద్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగిన వార్తను క్యారీ చేసింది.
ఇలా తెలుగు సమాజానికి సంబంధం లేని వ్యక్తులు, వ్యవస్థలపై సుప్రీంకోర్టులో ఏం జరిగిందో కూడా ఈనాడు రాసుకొచ్చింది. నీతులు ఎదుటి వాళ్లకు చెప్పడానికే తప్ప, తమకు కాదని ఈనాడు మీడియా తన చేష్టలతో నిరూపించుకుంది. ఈనాడు గురివింద గింజ నీతిని పాఠక లోకం గమనిస్తోంది.