‘అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతుల్లో ఎక్కువమంది కమ్మవారు ఉన్నారు కనుకనే తన కులానికి ప్రయోజనాలు కల్పించడం కోసమే చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని కోసం ఆరాటపడుతున్నారు’ అనే వాదన మనకు తరచుగా వినిపిస్తూ ఉంటుంది.
అమరావతి రైతులుగా చెప్పుకునే వర్గాలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇలాంటి వాదనలను ఖండిస్తూ ప్రతి విమర్శలు చేస్తూ ఉంటారు. అమరావతి రాజధాని అనేది ఒక కులానికి పరిమితమైనది కానే కాదని అన్ని కులాల వారూ భూములు ఇచ్చిన రైతులలో ఉన్నారని వారు లెక్కలు చెబుతూ ఉంటారు.
తెలుగుదేశం తానా అంటే తందానా అనడానికి సదాసిద్ధంగా ఉండే పచ్చ మీడియా ఆ లెక్కలను మరింత విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళుతూ ఉంటుంది. అమరావతి భూములు ఇచ్చిన వారిలో మెజారిటీ ఉన్నది ఎస్సీలేనని, ఆ తరువాత సంఖ్యాపరంగా ఎక్కువమంది రెడ్డి వర్గం వారని మూడో స్థానం మటుకే కమ్మవారికి వస్తుందని ఇలా రకరకాల గణాంకాలు వెలుగులోకి వస్తుంటాయి.
ఒకింతసేపు వీరు ప్రచారం చేస్తున్న గణాంకాలన్నీ నిజమే అనుకుంటే.. ‘అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలిపోతుంది.. రాష్ట్రంలో మరో రెండు ప్రాంతాలలో కూడా సమాన ప్రాధాన్యం గల రాజధానులు ఏర్పడతాయి’ అనే ప్రతిపాదన తెరమీదకు వచ్చినప్పుడు కేవలం కమ్మవారు మాత్రమే ఎందుకు ఆవేదన చెందుతున్నారు? ఎందుకు కుమిలిపోతున్నారు? ఎందుకు పోరాటాల ముసుగులో తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు అనేది కీలక చర్చనీయాంశం.
ఇవాళ ‘అమరావతి నుంచి అరసవెల్లి దాకా’ అనే ట్యాగ్ లైన్ తో ఒక మహా పాదయాత్ర జరుగుతోంది. నిన్న ‘అమరావతి నుంచి తిరుమల దాకా’ మరో మహా పాదయాత్ర కూడా జరిగింది! అయితే ఈ యాత్రలో పాల్గొన్న వారందరూ ఎవరు ఏ కులానికి చెందినవారు? యాత్రను సమర్థిస్తూ గళం వినిపిస్తున్న వారంతా ఎవ్వరు? అందరూ కూడా మెజారిటీ కమ్మ కులస్తులు మాత్రమే.
పచ్చమీడియా ప్రచారం చేస్తున్నట్టుగా.. అమరావతిలో పొలాలు ఇచ్చిన రైతుల్లో ఎస్సీ ఎస్టీలు, రెడ్లు మాత్రమే గరిష్ట సంఖ్యలో ఉండేట్లయితే.. ఈ రైతుల పాదయాత్రల్లో కూడా అదే గణాంకాలు ప్రతిఫలించాలి కదా అనేది ప్రజల సందేహం. యాత్రలో కేవలం చెప్పుకోడానికి ఆయా కులాలనుంచి ఒకరిద్దరు తప్ప.. ఎవ్వరూ కనిపించరు. గగ్గోలు మొత్తం కమ్మవారిది మాత్రమే నడుస్తూ ఉంటుంది.
కులాల లెక్కలను తీయదలచుకున్నప్పుడు.. కేవలం రాజధాని కోసం పొలాలు ఇచ్చిన రైతుల కులాలను మాత్రం లెక్కతీస్తే సరిపోదు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాతినుంచి.. అమరావతిగా రాజధాని ప్రకటన వచ్చే వరకు.. మధ్య కాలంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన అన్ని భూ కొనుగోళ్లను కూడా పరిశీలించాల్సి ఉంది. కోర్ కేపిటల్ ఏరియాకు చుట్టుపక్కల ఉన్న భూములు మొత్తం ఎవ్వరివి? ఏ కులంవారు వాటిని అత్యధికంగా కొనుగోలు చేసారు అనే వివరాలను కూడా పరిశీలించాల్సి ఉంది.
రైతులు ఇచ్చిన పొలాల రాజధాని పరిధికి బయట ఉన్న పొలాలు, స్థలాలు అన్నీ ఎవరివో.. వారి కొనుగోళ్లు ఎప్పుడు జరిగాయో పరిశీలించాలి. కమ్మ ప్రయోజనాలు ఎంత బలంగా ఉన్నాయో అప్పుడు అర్థమవుతుంది. వాస్తవానికి.. పొలాలు ఇచ్చిన రైతుల కులాల పరంగా ఎలా ఉన్నప్పటికీ.. ఒక్క కమ్మకులం మాత్రమే.. కమ్మ మీడియా మాత్రమే అమరావతి అంటూ ఆవేదన చెందడాన్ని గమనిస్తే అసలు మర్మం ఎవ్వరికైనా బోధపడుతుంది.