విశాఖకు పరిపాలనా రాజధాని కావాలని ఉత్తరాంధ్రా విద్యార్ధి జాయింట్ యాక్షన్ కమిటీ గట్టిగా కోరుకుంటోంది. ఈ విషయంలో అందరూ కలసిరావాలని కూడా జేఏసీ పిలుపు ఇస్తోంది. విశాఖకు రాజధాని వస్తే అత్యంత వెనకబడిన ప్రాంతాలు పూర్తిగా బాగుపడతాయని జేఏసీ ప్రతినిధులు అంటున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏకాభిప్రయానికి రావాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది.
విశాఖ నగరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్ధి జేఏసీ ఆద్వర్యాన భారీ ర్యాలీని నిర్వహించి మరీ తమ రాజధాని కోరికను గట్టిగా చాటుకున్నారు. ఉత్తరాంధ్రాలో రాజధాని ఉంటే ఇక్కడ అత్యధిక శాతం ఉన్న బీసీ ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకనే చంద్రబాబు తన బినామీలతో అమరావతి నుంచి అరసవెల్లి దాకా పాదయాత్రను చేయిస్తున్నారు అని విమర్శించారు.
ఇది ఉత్తరాంధ్రా ప్రయోజనాలను దెబ్బ తీసే చర్యగా తాము భావిస్తున్నామని విద్యార్ధి జేఏసీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇక ఉత్తరాంధ్రా ఓట్లతో గెలిచిన తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు అంతా ఈ ప్రాంతానికి మద్దతుగా ఉండాలని లేకపోతే తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
తమ వైఖరిని ఉత్తరాంధ్రాలోని అన్ని రాజకీయ పార్టీలు విశాఖ రాజధానికి అనుకూలంగా మార్చుకోకపోతే ఆయా పార్టీ ఆఫీసుల ముందు భవిష్యత్తులో ఆందోళన చేపడతామని, ముట్టడిస్తామని హెచ్చరించారు. అమరావతి రైతుల పాదయాత్రకు విశాఖ జిల్లా సరిహద్దు పాయకరావు పేట వద్దనే బ్రేకులు వేస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. విద్యార్ధుల ఆగ్రహం అయితే ఇపుడు అగ్గి మంటలా ఉంది, దీంతో రాగల పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలని అంటున్నారు.