వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆర్తనాధాలు రిపీట్ అయ్యాయి. ఆ రోజు రాత్రి కస్టడీలో రఘురామకు సీఐడీ ఇచ్చిన ట్రీట్మెంట్ మరోసారి పునరావృతం అయ్యింది.
ఈ దఫా రఘురామ స్థానంలో టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర ఉన్నారు. అంతే తేడా. బాధితుడు, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చెబుతున్నట్టు మిగతావన్నీ ఒకటే. అవే దెబ్బలు, అవే ఆర్తనాధాలు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టడం, దాన్ని విస్తృతంగా దుష్ప్రచారం చేయడంపై నరేంద్రను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
సీఐడీ ట్రీట్మెంట్పై బాధితుడు నరేంద్ర మాటల్లోనే…. ‘రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు హెచ్చరించినట్టుగానే సీఐడీ అధికారులు నరకం చూపారు. ఒంటిపై బట్టల్లేకుండా చేశారు. కట్ డ్రాయర్ మాత్రమే మిగిల్చారు. రెండు కాళ్లు చాపించి వాటిపై కూచున్నారు. కాళ్లు తొక్కారు. గుంజీళ్లు తీయించారు. పంగచీల్చి చితక్కొట్టి నరకం చూపారు’ అని ఆయన వాపోయారు. మేజిస్ట్రేట్ ఎదుట తన ఆవేదనను వినిపించారు.
వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను జీజీహెచ్‌కు మేజిస్ట్రేట్ సిఫార్సు చేశారు. వైద్య నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని మేజిస్ట్రేట్ తెలిపారు. ఇదిలా వుండగా గతంలో రఘురామ కూడా ఇదే రీతిలో సీఎం జగన్, సొంత పార్టీ నేతలపై ఇష్టానురీతిలో మాట్లాడుతున్నారని, కులాల పేరుతో వైషమ్యాలు రెచ్చగొడుతున్నారంటూ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ నుంచి గుంటూరులోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లి చితకొట్టారని రఘురామ అనేక సందర్భాల్లో వాపోయారు. ఇప్పటికీ నాటి కాళరాత్రిని ఆయన గుర్తు చేస్తుంటారు. గుండె ఆపరేషన్ చేయించుకున్నానని మొర పెట్టుకున్నా వినలేదని, అబ్బా, అమ్మా, నాయనా అని చావుకేకలు పెట్టినట్టు రఘురామ చెప్పిన సంగతి తెలిసిందే. అలాంటి ట్రీట్మెంట్నే మరోసారి టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌కు ఇచ్చినట్టు, ఆయన ఆవేదన తెలియజేస్తోంది.