అసెంబ్లీ వేదికగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ నవ్వుతూనే టీడీపీపై దండయాత్ర చేశారు. విద్యవైద్యం, నాడునేడుపై స్వల్పకాలిక చర్చలో భాగంగా మంత్రి విడదల రజినీ తన మార్క్ ప్రసంగంతో ప్రధాన ప్రతిపక్షంపై ఎదురు దాడికి దిగారు. రాష్ట్రంలో విష జ్వరాల కట్టడికి తమ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందన్నారు. జగన్ ప్రభుత్వంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. నాడు చంద్రబాబు హయాంలో, నేడు తమ ప్రభుత్వ హయాంలో వైద్యరంగంలో మార్పులు గురించి ఆమె వివరంగా చెప్పుకొచ్చారు.
డెంగ్యూ, మలేరియాలను ఆరోగ్యశ్రీలో తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేర్చారని రజినీ అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో దోమలపై దండయాత్ర అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. దోమలపై దండయాత్ర అంటూ టీడీపీ వాళ్లు ఏం చేశారో మంత్రి సభ దృష్టికి తీసుకొచ్చారు. చాలా ఆర్భాటంగా, చాలా ఖర్చు చేసి ప్రజలపైకి దోమలను వదిలారని మంత్రి సెటైర్ విసిరారు.
దోమలపై దండయాత్ర చేసినపుడు లక్ష కేసులు నమోదయ్యాయన్నారు. దోమలపై దండయాత్ర అంటూ రాష్ట్ర ప్రజలకు నాటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన మెసేజ్‌ను ఆమె చదివి వినిపించారు.
“కేంద్రం కంటే నేనే తెలివైన వాడిని. అందుకే ప్యాకేజీకి అంగీకరించా. డబ్బు లేకుండానే ఎన్నో చేశా. డబ్బుంటే రాష్ట్రాన్ని నంబర్ ఒన్ చేస్తా. కేంద్రం చేయలేక పోలవరం బాధ్యతల్ని నాకు అప్పగించింది. తెలంగాణ ప్రభుత్వం నాపై కేసు పెట్టే సాహసం కూడా చేయలేదు. నన్నెవరూ ఏమీ చేయలేరు. దోమలపై దండయాత్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు” అంటూ మంత్రి విడదల రజినీ చదివి వినిపించారు.
దోమలపై టీడీపీ ఏ విధంగా దండయాత్ర చేసిందో వారి మాటల్లోనే చెబుతూ… ప్రధాన ప్రతిపక్షంపై విడదల రజినీ దండయాత్ర చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.