“శత్రువులు ఎక్కడో ఉండరు, చెల్లెళ్లు-కూతుళ్లు రూపంలో మారువేషాలు వేసుకొని, మన కొంపలోనే తిరుగుతా ఉంటారు.” ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది. ఇది ఎంతమందికి వర్తిస్తుందో తెలియదు కానీ, రజనీకాంత్ కు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో అచ్చుగుద్దినట్టు, అతికినట్టు సరిపోతుంది.
జైలర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన రజనీకాంత్ ను మరోసారి కార్నర్ లో నెట్టేసింది ఆమె కూతురు ఐశ్వర్య రజనీకాంత్. ఆమెకు ఫ్లాపులు కొత్త కాదు, ఆ మాటకొస్తే రజనీకి కూడా ఫ్లాపులు కొత్తకావు. కానీ ఈసారి కూతురు ఇచ్చిన స్ట్రోక్ మాత్రం అలాంటిలాంటిది కాదు.
లాల్ సలామ్ సినిమా రజనీకాంత్ కు 2 రకాల తలనొప్పులు తెచ్చిపెట్టింది. సినిమా విడుదలకు ముందు కూతురు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఒక రకమైన తలనొప్పికి కారణమైతే.. విడుదల తర్వాత ఈ సినిమా ఇచ్చిన ఫలితం మరో రకమైన తలనొప్పికి కారణం.
మొదటి తలనొప్పిని మెల్లగా వదిలించుకున్న రజనీకాంత్, రెండో తలనొప్పిని మాత్రం వదిలించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే, లాల్ సలామ్ సినిమా గట్టిగా దెబ్బేసింది. రజనీకాంత్ కెరీర్ లోనే ఎపిక్ డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది.
ఇంతకుముందే చెప్పుకున్నట్టు రజనీకాంత్ కు ఫ్లాపులు కొత్త కాదు. కానీ లాల్ సలామ్ లాంటి ఫ్లాప్ ను మాత్రం ఆయన ఇప్పటివరకు చూసి ఉండరు. మరీ ముఖ్యంగా 625 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత, పాతిక కోట్ల కలెక్షన్ కోసం కిందామీద పడుతున్న లాల్ సలామ్ లాంటి రిజల్ట్ ను ఆయన కలలో కూడా ఊహించి ఉండరు.
తెలుగులో ఈ సినిమా ఇవాళ్టితో వాష్-అవుట్ అయింది. అటు తమిళ్ లో రజనీకాంత్ కు ఉన్న ఫ్యాన్ బేస్ వల్ల కొంచెం నడుస్తోంది. అది కూడా మరో 3-4 రోజులు మాత్రమే అనేది ట్రేడ్ టాక్.