వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ కీలక విజయసాయిరెడ్డి స్పందించాల్సిన సమయం ఇది. ప్యానల్ వైస్ చైర్మన్లగా 8 మందికి స్థానం కల్పిస్తూ ఈ నెల 5న రాజ్యసభ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో తనకు చోటు కల్పించిన విషయాన్ని ట్విటర్ ద్వారా విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అయితే రెండు రోజులకే ఏమైందో తెలియదు కానీ, ప్యానల్ వైస్ చైర్మన్ల జాబితాను పునరుద్ధరిస్తూ తిరిగి ఏడో తేదీన కొత్తగా విడుదల చేశారు. ఇందులో విజయసాయిరెడ్డి పేరు లేకపోవడంతో ఆయనకు రాజ్యసభ చైర్మన్ షాక్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అసలే విజయసాయిరెడ్డికి, ప్రతిపక్షాలు, వాటి మీడియాకు మధ్య వార్ నడుస్తోంది. విజయసాయిరెడ్డికి చిన్న ప్రతికూల అంశం ఎదురైనా పెద్దది చేసి చూపిస్తారు.
ఇలాంటి తరుణంలో విజయసాయిరెడ్డి పేరు ప్రకటించి, ఆ తర్వాత లేదనడం అంటే అవమానించడమే. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదు. అయితే తన పేరు తొలగింపునకు అసలు కారణం ఏంటో విజయసాయిరెడ్డి చెబితే బాగుంటుంది. ఎందుకనో ఆయన ఇంకా ఈ విషయమై ట్విటర్‌లో స్పందించలేదు.
రెండురోజుల క్రితం ఢిల్లీలో చంద్రబాబు రానున్న ఎన్నికల్లో తమదే విజయం అని చెప్పడంపై తాజాగా విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీకి 11 సీట్లు వస్తాయా చంద్రం? అని ఆయన ప్రశ్నించారు. మరి తన విషయమై ఆయన ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.