అప్పటికే వరుసగా అయిదో ఎన్నికల్లో అధికారంలో కొనసాగుతూ వచ్చిన భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో 2017 ఎన్నికల్లో 99 స్థానాలకు పరిమితం అయినప్పుడు.. దేశవ్యాప్తంగా మోడీ ప్రాభవం తగ్గుతున్నదనడానికి దానిని నిదర్శనంగా ప్రచారం చేయడానికి ప్రత్యర్థులు బహుధా ప్రయత్నించారు. గుజరాత్ లో బిజెపి పని అయిపోయిందని, అది లాస్ట్ టర్మ్ అవుతుందని, తర్వాతి సమయానికి అధికారాన్ని వదులుకోవాల్సి ఉంటుందని అంచనా వేశారు. కానీ వారి విశ్లేషణల్నీ తలకిందులు చేస్తూ.. గుజరాత్ లో బిజెపి అఖండమైన విజయాన్ని నమోదు చేస్తున్నది. 99 నుంచి ఎగబాకి ఏకంగా 150 దాటిపోయింది.
మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత.. గుజరాత్ లో నిశ్శబ్ద విప్లవం ఉన్నదని, ప్రజలు పైకి ఎలా కనిపించినప్పటికీ ఓట్లు మాత్రం గంపగుత్తగా కాంగ్రెసు పార్టీకే వేస్తారని, కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నదని ఢంకాబజాయించి చెప్పిన జోస్యం పాపం.. దారుణంగా తేలిపోయింది. ఆ పార్టీ కనీసం 20 స్థానాలు కూడా దక్కించుకునేలా లేదు.
ఢిల్లీలో లాంటి పరిపాలనను ఇక్కడ కూడా రుచిచూపిస్తాం అంటూ.. భీషణ ప్రతిజ్ఞలతో గుజరాతీలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతీ తెరిచే పరిస్థితే లేదు. నిజానికి అరవింద్ కేజ్రీవాల్ హిమాచల్ ప్రదేశ్ కంటె.. గుజరాత్ కోసం చాలా ఎక్కువగా చెమటోడ్చి పనిచేశారు. హిమాచల్ లో వారికి కొన్ని సీట్లు దక్కతున్నాయి గానీ.. గుజరాత్ లో ఎవ్వరూ కేజ్రీవాల్ మాటలను నమ్మలేదని తేలిపోయింది.
గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని నరేంద్రమోడీ సర్వం తానై నడిపించారు. ఇది కేవలం మోడీ సాధించిన విజయంగా భావించాల్సిందే. ఆయన రోడ్ షోలు, సభలు నిర్వహిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. నరేంద్రమోడీపై గుజరాత్ ప్రజలలో అచంచలమైన విశ్వాసం ఉన్నదనే విషయం ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా బయటపడింది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. ఢిల్లీలో ప్రధానిగా నరేంద్రమోడీ ఉన్నంతవరకు గుజరాత్ లో భారతీయ జనతా పార్టీని ఓడించడం ఎవ్వరికీ సాధ్యం కాదనే సంగతి కూడా అర్థమైపోయింది. ఇదంతా కేవలం మోడీ హవా.
ఈ గుజరాత్ విజయం.. భారతీయ జనతా పార్టీకి ఎంతో ఉత్తేజం ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇంకో ఏడాదిన్నర వ్యవధిలో పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉన్న సమయంలో.. ఈ విజయం వారికి ప్రేరణ ఇస్తుంది. మోడీ పట్ల గుజరాతీల అచంచలమైన నమ్మకం దేశప్రజలను కూడా ఆలోచింపజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ హిమాచల్ లో అధికారం దక్కితే ఆ విజయంతో ఊరట పొంది, గుజరాత్ లో ఎందుకు అంత ఘోరమైన స్థితికి పడిపోయామో నిజాయితీగా ఆత్మసమీక్ష చేసుకుంటే తప్ప.. దేశమంతా వారికి అదే పరిస్థితి ఎదురవుతుంది.