నందమూరి కుటుంబం నుంచి మరొకరి పొలిటికల్ ఎంట్రీ? 

గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించి తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆయన ఓడించాలనుకుంటున్న వైసీపీ ముఖ్య నేతల లిస్టులో నాని పేరు అగ్ర స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. నాని…

గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించి తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆయన ఓడించాలనుకుంటున్న వైసీపీ ముఖ్య నేతల లిస్టులో నాని పేరు అగ్ర స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. నాని నోరు విప్పితే బూతులు మాట్లాడతాడని పేరున్నా గుడివాడలో బలమైన నాయకుడిగా కూడా పేరుంది. 

ఒకప్పుడు ఈయన టీడీపీలో ఉన్న నాయకుడే. అందులోనూ ఎన్టీఆర్ వీరాభిమాని. జూనియర్ ఎన్టీఆర్ కు బాగా క్లోజ్ అనే పేరుంది. మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబును అసెంబ్లీలో ఉతికి ఆరేసేవాడు. బయట కూడా బూతులు తిట్టేవాడు. కాబట్టి చంద్రబాబుకు నాని మీద పీకల దాకా కోపం ఉండటం సహజం. అందులోనూ వైసీపీ నాయకుడు కూడా. మరి నానిని ఓడించాలంటే మార్గం ఏమిటి? ఈ ప్రశ్న బాబును తొలిచేస్తోంది.

నానిని ఓడించగల గట్టి అభ్యర్థి ఎవరు? అంత బలమైన నాయకుడు టీడీపీలో బాబుకు ఎవరూ దొరకడం లేదేమో. కొడాలి నానిని ఓడించటం ఈ సారి టీడీపీ ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి కాబట్టి కొత్త నిర్ణయాలకు చంద్రబాబు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే కొందరు అభ్యర్ధుల పేర్లు కొడాలి నాని మీద పోటీ చేస్తారంటూ ప్రచారంలోకి వచ్చాయి. టీడీపీ వారి పైన ఫీడ్ బ్యాక్ తీసుకొనే క్రమంలోనే ఈ పేర్లు తెర మీదకు వచ్చినట్లు మరో వాదన. అయితే, కొడాలి నాని పైన పార్టీలో ప్రస్తుతం ఉన్న నేతల్లో ఎవరిని దించినా..ఫలితం ఎలా ఉంటుందనే అంశంలో సందేహాలు నెలకొన్నాయి. ఒక దశలో మాజీ మంత్రి ఉమా పేరు తెర పైకి వచ్చింది.

స్థానిక నేతలు ఎవరికి వారు తామే రానున్న ఎన్నికల్లో అభ్యర్ధులమని చెప్పకుంటున్నారు. కానీ, పార్టీ అధినేత ఆలోచన మాత్రం మరోలా ఉంది. గుడివాడలో ఉన్న సామాజిక సమీకరణాలు…పార్టీ బలంతో వ్యక్తిగత ఇమేజ్ కలిసి వచ్చే వారిని బరిలోకి దించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కొడాలి నాని పలు సందర్భాల్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్.. నందమూరి కుటుంబం పైన తన అభిమానం చాటుకున్నారు. అదే సమయంలో చంద్రబాబు – లోకేశ్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తినే టీడీపీ నుంచి గుడివాడ బరిలో దించాలని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

దీని ద్వారా కొడాలి నాని మద్దతు దారులుగా ఉన్న వారు సైతం టీడీపీకి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ గుడివాడలో తనను ఓడించేందుకు భారీ మొత్తం ఖర్చు చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా నాని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నందమూరి బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేస్తుండటం.. లోకేశ్ మంగళగిరి ఖరారు కావటంతో, నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడిని ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం అయిన గుడివాడ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి నందమూరి కుటుంబం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. గుడివాడ నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా నందమూరి చైతన్య కృష్ణ బరిలోకి దిగుతాడట. 

నందమూరి ఎన్టీరామారావు కుటుంబంలో రాజకీయాల్లోకి వచ్చినవారిలో బాలకృష్ణ పేరు సుపరిచితం. ఆల్రెడీ ఆయన సినిమా హీరో కాబట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టకముందే ఆయన పాపులర్. ఆ తరువాత హరికృష్ణ. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి హరికృష్ణ కూడా రాజకీయాల్లో ఉన్నట్లే లెక్క. ఆ తరువాత ఎంపీ (రాజ్యసభ) అయ్యాడనుకోండి. కూతుళ్లతో పురందేశ్వరి రాజకీయాల్లోకి అడుగుపెట్టి యూపీఏ పాలనలో కేంద్రమంత్రి అయ్యారు. ఇప్పుడు బీజేపీ నాయకురాలు. జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాకపోయినా ఒకప్పుడు టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం చేశాడు. నందమూరి కుటుంబంలో రాజకీయంగా జనాలకు తెలిసినవారు వీరు మాత్రమే.

చంద్రబాబు ఇప్పుడు ఒక కొత్త పేరును తెర మీదికి తీసుకువచ్చారు. ఆ పేరే నందమూరి చైతన్య కృష్ణ. ఇంతకూ ఈయన ఎవరయ్యా అంటే … ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు. కొద్ది నెలల క్రితం చంద్రబాబు తన సతీమణి పైన వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ కన్నీటి పెట్టుకున్న సంగతి తెలిసిందేకదా. ఆ సమయంలో వైసీపీ నేతలు లక్ష్యంగా నందమూరి చైతన్య కృష్ణ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. వల్లభేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబుకు హెచ్చరికలు చేసారు. తాజాగా సినీ రంగంలో ప్రవేశించిన చైతన్య కృష్ణ కు బాబాయ్ బాలయ్య పూర్తి మద్దతు ప్రకటించారు. 

బసవతారకం క్రియేషన్స్ పతాకం పైన చైతన్య కృష్ణ సినిమా నిర్మాణం జరుగుతోంది. దీంతో, నందమూరి వారసుడే గుడివాడ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగితే పార్టీ శ్రేణులంతా అక్కడ కొడాలి నానికి వ్యతిరేకంగా కలిసి కట్టుగా పని చేస్తాయని బాబు అంచనా వేస్తున్నారట. మరి ఈ నందమూరి చైతన్య కృష్ణకు నానిని ఓడించే సత్తా ఉంటుందా? ఈయన ఎవరో ప్రజలకు తెలియదు. నందమూరి అన్న ఇమేజ్ తో నెట్టుకురాగలడా?