చంద్రబాబును నియంతగా చాటిచెప్తున్న ఈనాడు!

ఈనాడు దినపత్రిక లక్ష్యం- జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లడం! ఏపీలో ఏం జరిగినా సరే దాన్ని ఏదో ఒక రీతిగా జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టడం వారి కర్తవ్యం. చివరకు ఆయన సొంత భద్రత గురించి…

ఈనాడు దినపత్రిక లక్ష్యం- జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లడం! ఏపీలో ఏం జరిగినా సరే దాన్ని ఏదో ఒక రీతిగా జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టడం వారి కర్తవ్యం. చివరకు ఆయన సొంత భద్రత గురించి ఒక వ్యవస్థీకృతమైన ఏర్పాటుచేసుకుంటే దాన్ని కూడా బజారుకీడ్చడానికి, దానిమీద కూడా బురద చల్లడానికి ఆ పత్రిక ప్రయత్నిస్తోంది. 

అయితే ఈ ప్రయత్నంలో.. భద్రతా వ్యవస్థను పటిష్టీకరించే ప్రయత్నాలను నియంతల వైఖరితో పోల్చిన ఈనాడు, తాము చెప్పిన నిర్వచనాల ప్రకారం.. చంద్రబాబునాయుడే అతిపెద్ద నియంత అని చెప్పినట్లు తేలడమే తమాషా!

ఇంతకూ ఏం జరిగిందంటే.. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ భద్రత కోసం సర్కారు కొత్తగా ఎస్ఎస్‌జిని ఏర్పాటుచేస్తూ ఒక చట్టం తీసుకువచ్చింది. ప్రధానమంత్రి కోసం ఎస్పీజీ భద్రత ఉన్న తరహాలోనే ముఖ్యమంత్రి కోసం ఈ ఎస్ఎస్‌జి భద్రత వ్యవస్థ పనిచేస్తుంది. ముఖ్యమంత్రి కుటుంబం దేశవిదేశాల్లో ఎక్కడ ఉన్నా సరే.. వారికి ఈ చట్టం కింద భద్రత కల్పిస్తారు. 

ముఖ్యమంత్రి భద్రత కోసం ప్రస్తుతం సీఎంఎస్‌జి అనే వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు జగన్ సర్కారు కేవలం ఈ వ్యవస్థ యొక్క పేరు మారుస్తోంది అంతే. సీఎం భద్రత విభాగానికి మంజూరైన పోస్టులు అన్నింటినీ ఈ ఎస్ఎస్‌జికి కేటాయించారు. అంటే పేరు మారుతుంది.. మరియు, ఇంకొంత వ్యవస్థీకృతంగా ఆ రంగం పనిచేస్తుంది.

అయితే విమర్శలు కురిపిస్తున్న వారంతా గమనించాల్సింది ఏంటంటే.. ఇది జగన్మోహన్ రెడ్డి కోసం చేసిన చట్టం కాదు. ఏపీ ముఖ్యమంత్రి కోసం. ఇప్పుడు విలపిస్తున్న వారు కోరుకుంటున్నట్టుగా.. చంద్రబాబునాయుడు భవిష్యత్తులో సీఎం అయినా కూడా.. ఇదే చట్టం ప్రకారమే వారికి భద్రత అందుతుంది. కానీ.. జగన్ మీద ఏదో బురద చల్లాలి గనుక.. ఈనాడు ఇలాంటి ప్రయత్నం చేస్తోంది.

జగన్ కేవలం తనలోని భయం వల్లనే ఈ చట్టం తెస్తున్నట్టుగా ఈనాడు రాసిన రాతలు గలీజుగా ఉండడం గమనార్హం. ‘‘ప్రపంచంలో ఏ నియంతైనా ప్రతిక్షణమూ అభద్రత, మితిమీరిన భయంతో బతుకుతుంటారు. వారి నీడను కూడా నమ్మరు.’’ అంటూ వర్ణన ప్రారంభించి.. జగన్మోహన్ రెడ్డి ఆ తరహాలోనే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేైసుకుంటున్నారు అని ఈనాడు రాసింది. నియంతలకు ఈనాడు ఇచ్చిన ఈ  నిర్వచనం నిజమే కావొచ్చు. జగన్ ను ఆ తరహాలో అని మాత్రమే ఇందులో పేర్కొన్నారు. 

కానీ.. ఇదే ఈనాడు దినపత్రిక గతంలో చంద్రబాబునాయుడు రాజకీయ జీవితం గురించి ప్రచురించిన ఒక ప్రత్యేక కథనంలో ‘ఆయన తన నీడను కూడా నమ్మరు’ అని స్పష్టంగా చంద్రబాబు గురించి రాసింది. ఇవాళ జగన్ మీద బురద చల్లడానికి ఈనాడు చేసిన ప్రయత్నం వల్ల.. వారి పాత కథనం ప్రకారం.. చంద్రబాబునాయుడు అసలు నియంత అని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.