రామోజీరావు మీద ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందనే సంగతి క్లియర్ గా అర్థమవుతూనే ఉంది. ఈ వ్యవహారం చూస్తోంటే.. పోకిరి సినిమాలోని ఒక డైలాగు గుర్తుకు వస్తుంది. ప్రకాష్ రాజ్ ను పోలీసులు పట్టుకున్న తర్వాత.. పోలీసు అధికారి షాయాజీ షిండే అతనితో అంటాడు.. ‘ఇప్పటిదాకా నీకు సరైన ఆఫీసర్ తగల్లేదు’ అని! పాపం రామోజీరావు పరిస్థితి కూడా అచ్చంగా అలాగే తయారైంది.
తాను ఒక మీడియా సామ్రాజ్యానికి అధిపతిని గనుక.. చట్టమూ నిబంధనలూ లాంటివేవీ తనకు వర్తించవని విర్రవీగుతూ ఉండే రకం ఆయన! ఆ సినిమాలో డైలాగు లాగా.. సరైన ముఖ్యమంత్రి ఎవ్వరూ ఆయనకు తగల్లేదు. లేదా, తాను కొమ్ముకాసే తెలుగుదేశం కాకుండా ఇతరులు ముఖ్యమంత్రులు అయినప్పుడు కూడా ఆయన ఆటలు సాగాయి.
వైఎస్ఆర్ సీఎం అయినప్పుడు.. మార్గదర్శి అక్రమ బాగోతానికి తెరదించారు. కానీ చిట్స్ గురించి ఆయన పట్టించుకోలేదు. జగన్ ఇప్పుడు.. ఆ అక్రమాలను కూడా బయటకు తెస్తున్నారు.
ఈ ఎపిసోడ్ అంతా ఒక ఎత్తు అయితే.. జగన్ ప్రభుత్వం, ఏపీ సీఐడీ తన మార్గదర్శ అక్రమాల మీద సాగిస్తున్న దాడి/దర్యాప్తులో చూడబోతే రామోజీరావు ఒంటరి అయిపోతున్నారనే భావన ప్రజలకు కలుగుతోంది. తెలుగుదేశం పార్టీకి బాకా ఊదుతూ ఆ పార్టీకి ఎంతగా అండగా నిలబడినప్పటికీ.. ఇప్పుడు ఆయనకు క్లిష్టకాలం దాపురించినప్పుడు.. ఆ పార్టీ నాయకులు అదే స్థాయిలో తనకు అండగా నిలబడడం లేదని ప్రజలు భావిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీలో ఒకరిద్దరు నాయకులు రామోజీ అనుకూల ప్రకటనలు చేశారే తప్ప.. చంద్రబాబుకు ఈనాడు అండగా నిలబడి స్థాయిలో వారివైపు నుంచి స్పందన లేదు. తమకు ఉన్న తలనొప్పులు చాలునని, తమ పార్టీ నేతల అవినీతి బాగాతాలను శుభ్రంగా చూసుకుంటే చాలునని అనవసరంగా రామోజీ అక్రమాల వ్యవహారాలను తాము వెనకేసుకు వస్తే.. అనవసరంగా అభాసుపాలైపోతామని తెలుగుదేశం పెద్దలు భావిస్తున్నట్టుగా సమాచారం.
న్యూటన్ మూడో సూత్రం అనేది ప్రతి సందర్భంలోనూ నిజం కావాలనే నియమం లేదు. తెలుగుదేశం సకల అక్రమాలకు రామోజీ దన్నుగా నిలిచి ఉండవచ్చు. కానీ రామోజీ అక్రమాలకు తెలుగుదేశం సమానంగా స్పందించడం లేదు. తప్పు చేయడం అంటూ జరిగితే.. తాను కొమ్ము కాసినవాళ్లు కూడా హఠాత్తుగా మొహం చాటేస్తారనే నీతిని రామోజీ ఈ ఎపిసోడ్ ద్వారానైనా అర్థం చేసుకుంటే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు.