విశాఖ ఉక్కును కెలికి భారాస సెల్ఫ్ గోల్!

విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో తాము కూడా పాల్గొంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం.. అక్కడ పరిస్థితులను అధ్యయనం చేయడానికి సింగరేణి కాలరీస్ కు చెందిన ముగ్గురు డైరెక్టర్లను విశాఖకు పంపడం అనే పరిణామాలు ఇప్పుడు రాజకీయ…

విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో తాము కూడా పాల్గొంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం.. అక్కడ పరిస్థితులను అధ్యయనం చేయడానికి సింగరేణి కాలరీస్ కు చెందిన ముగ్గురు డైరెక్టర్లను విశాఖకు పంపడం అనే పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చినీయాంశంగా ఉన్నాయి.

విశాఖ ఉక్కు ప్రెవేటీకరణను అడ్డుకుంటాం అంటూ కేటీఆర్ చాలా ఘాటుగా ప్రకటించారు. ఆ తర్వాత.. బిడ్డింగ్ లో పాల్గొననున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనికి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఘాటుగానే కౌంటర్లు ఇచ్చారు. మొత్తానికి.. విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొంటామని ప్రకటించడం ద్వారా.. భారాస సెల్ఫ్ గోల్ వేసుకున్నదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల్లో ఉన్నదని, దానిని ప్రెవేటీకరించడానికి మోడీ సర్కారు నిర్ణయం తీసుకున్నందుకు ఏపీలో చాలాకాలంగా వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది. నిజం చెప్పాలంటే.. విశాఖ ఉక్కు ప్రెవేటీకరణకు కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా గట్టి, వారికి చురుకు పుట్టించగల పోరాటం ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా భుజానికెత్తుకోలేదు. స్థానికంగా విశాఖలో మాత్రం నిరసన దీక్షలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా .. మొక్కుబడిగా.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రకటించి చేతులు దులుపుకున్నాయి. 

పవన్ కల్యాణ్ కాస్త ఓవర్ యాక్షన్ చేసి.. విశాఖ వెళ్లి అక్కడి నిరసనకారులతో కలిసి ఓ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు గానీ.. ఈ ఘోరమైన నిర్ణయం తీసుకున్నది తన మిత్రపక్షం బిజెపినే అయినప్పటికీ.. వారిలో కించిత్ మార్పు తీసుకురాలేకపోయారు. ఇదిలా ఉండగా మధ్యలో భారాస, తెలంగాణ ప్రభుత్వం తెరమీదకు వచ్చాయి.

విశాఖ ఉక్కు ప్రెవేటీకరణను తాము వ్యతిరేకిస్తాం అంటూ కేటీఆర్ విస్పష్టంగా ప్రకటించారు. సింగరేణి గనులను ప్రెవేటు సంస్థలకు వేలం వేయాలనుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్న భారాస, అదే తరహా పొలిటికల్ మైలేజీని కాంక్షిస్తున్నట్టుగా విశాఖ ఉక్కు ప్రెవేటీకరణను కూడా వ్యతిరకించింది. అన్ని పార్టీలు అదే మాట చెబుతున్నా.. కనీసం ఒక్క పార్టీ అయినా నిజాయితీగా పోరాటం చేస్తే ఫలితం ఉంటుందని అంతా అనుకున్నారు.

ఈలోగా సింగరేణి కాలరీస్ సంస్థ డైరక్టర్లు విశాఖ స్టీల్ ప్లాంటుకు వెళ్లి అక్కడ అధ్యయనం చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి బిడ్డింగ్ లో పాల్గొననున్నట్టు ప్రకటించారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు భారాసను అభాసు పాల్జేస్తున్నాయి.

ఏపీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఘాటుగానే కౌంటర్లు ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రభుత్వాలకు అసలు బిడ్డింగ్ లో పాల్గొనే అర్హతే లేదనే నిబంధనల్ని చూపించారు. ఒకవైపు ప్రెవేటీకరణను వ్యతిరేకిస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతూ బిడ్డింగ్ కు వెళ్తామనడం కామెడీగా ఉన్నదని దెప్పిపొడిచారు. అసలు విశాఖ ఉక్కు ప్రెవేటీకరణ మీద మీ వైఖరి చెప్పాలని అన్నారు. 

‘వ్యతిరేకిస్తాం’ అనే పదం ద్వారా.. ఏపీ ప్రజల్లో కాస్త  మంచిపేరు తెచ్చుకోవచ్చునని భారాస చిన్న డ్రామా ప్లే చేసినట్టుగా వ్యవహారం ఉంది. అయితే ఇది– బిడ్డింగ్ అనే వ్యవహారంతో  బెడిసికొట్టింది. బిజెపిని మరింత ఘాటుగా తిట్టడానికి, భారాస విశాఖ ఉక్కును వాడుకుంటున్నది తప్ప.. వారికి చిత్తశుద్ధి లేదని ప్రజలు అనుకుంటున్నారు.