టీడీపీపై వైసీపీ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా వైసీపీ మలుచుకుంటోంది. ఇదే సందర్భంలో టీడీపీ నెత్తికెత్తుకున్న రాజధాని ఎపిసోడ్, ఆ పార్టీకి భారమైంది. దీంతో దాన్ని దించుకోడానికే ప్రయత్నిస్తోంది. అమరావతే ఏకైక రాజధానిగా వుండాలంటూ ఇంత కాలంగా టీడీపీ గగ్గోలు చేసింది. ఆ పేరుతో రెండో విడత పాదయాత్రను కూడా వెనుకండి మొదలు పెట్టించింది.
ఉత్తరాంధ్ర నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడాన్ని టీడీపీ ఊహించలేకపోయింది. ఈ నేపథ్యంలో రాజధాని అంశంపై మిగిలిన ప్రాంతాల్లో తమకు రాజకీయంగా నష్టం తెస్తుందనే ఆందోళన టీడీపీలో మొదలైంది. పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ముందుకు కదల్లేని దుస్థితి. ఇదే అదునుగా వైసీపీ దూకుడు పెంచింది.
ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమలలో మూడు రాజధానులకు అనుకూలంగా పెద్ద ఎత్తున ర్యాలీలు, సభల నిర్వహణతో దూసుకెళుతోంది. ఈ పరంపరలో వచ్చే నెల 5న కర్నూలులో రాయలసీమ గర్జన సభను భారీగా నిర్వహించేందుకు నిర్ణయించింది. రాయలసీమ జేఏసీ పేరుతో సభ నిర్వహిస్తున్నప్పటికీ, దాని వెనుక అధికార పార్టీ ఉందనేది సుస్పష్టం. కర్నూలులో న్యాయ రాజధాని పెట్టాలనేది ఆ గర్జన సభ డిమాండ్.
ఒకవైపు రాజధాని అంశం తమకు రాజకీయంగా నష్టం కలిగిస్తుందని టీడీపీ వెనుకంజ వేయగా, దాన్నే తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ దూకుడు ప్రదర్శించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. చంద్రబాబు తనకు రాజకీయంగా నష్టం కలిగిస్తుందనుకుంటే ఎవరినైనా, దేన్నైనా పక్కన పడేస్తారనేందుకు అమరావతి ఎపిసోడే నిదర్శనమని చెబుతున్నారు. ప్రత్యర్థి బలహీనతల్ని పసిగట్టిన ముఖ్యమంత్రి జగన్… వ్యూహాలకు పదును పెట్టారు.
చంద్రబాబుపై మరింత ఒత్తిడి పెంచి, ఇరకాటంలో పడేసేందుకు వికేంద్రీకరణ పేరుతో గర్జిస్తున్నారు. చంద్రబాబు మాత్రం తనకు వ్యతిరేకం అవుతాయనుకుంటే దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ఆకాంక్షలపై నీళ్లు చల్లిన చంద్రబాబుకు ఆ ప్రాంత వాసులు తప్పక మరోసారి బుద్ధి చెబుతారని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కర్నూలు పర్యటనలో చంద్రబాబుకు న్యాయ రాజధాని డిమాండ్ ఎదురైన సంగతి తెలిసిందే.
ఆయన్ను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో చంద్రబాబుపై ఆగ్రహాన్ని మరింత రగిల్చేందుకు వైసీపీ చాపకిందు నీరులా పని చేస్తోంది. ఇందులో భాగంగానే డిసెంబర్ 5న కర్నూలులో రాయలసీమ చేసే గర్జన చంద్రబాబు వెన్నులో తప్పక వణుకు పుట్టిస్తుందనడంలో సందేహం లేదు. చంద్రబాబుకు ఏవీ కలిసి రావడం లేదనేందుకు అమరావతి అంశమే నిదర్శనం.